
ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లోనే ఏకంగా 585 పరుగులు సాధించాడు. ఈ పర్యటనలో భారత్ ఇంకా మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. గిల్ ఇదే ఫామ్‌ను తదుపరి మ్యాచ్‌ల్లో కూడా కొనసాగిస్తే ఓ ఆల్‌టైమ్ రికార్డు బద్దలయ్యే ప్రమాదం ఉంది.
అదేంటంటే.. ఐదు అంతకంటే తక్కువ మ్యాచ్‌ల ఓ సిరీస్‌లో (విదేశాల్లో) అత్యధిక పరుగుల రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా) పేరిట ఉంది. బ్రాడ్‌మన్ 1930 ఇంగ్లండ్ పర్యటనలో 974 పరుగులు చేశాడు. 95 ఏళ్లుగా టెస్ట్ క్రికెట్‌లో ఇదే రికార్డుగా కొనసాగుతోంది.
ఈ విభాగంలో రెండో స్థానంలో వాలీ హేమండ్ (ఇంగ్లండ్) ఉన్నాడు. హేమండ్ 1928/29 ఆసీస్ పర్యటనలో 905 పరుగులు చేశాడు. మూడో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన నీల్ హార్వే ఉన్నాడు. హార్వే 1952/53 పర్యటనలో 834 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో విండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఉన్నాడు. రిచర్డ్స్ 1976 ఇంగ్లండ్ పర్యటనలో 829 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో వెస్టిండీస్‌కు చెందిన క్లైడ్ వాల్కాట్ ఉన్నాడు. వాల్కాట్ 1955 ఆస్ట్రేలియా పర్యటనలో 827 పరుగులు చేశాడు.
భారత్ తరఫున ఈ రికార్డు సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. గవాస్కర్ 1970/71 వెస్టిండీస్ పర్యటనలో 4 మ్యాచ్‌ల్లో 774 పరుగులు చేశాడు. గవాస్కర్ తర్వాత ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 2014/15 ఆస్ట్రేలియా పర్యటనలో 692 పరుగులు చేశాడు.
భారత్ తరఫున విదేశీ టెస్ట్ సిరీస్‌ల్లో (ఐదు అంతకంటే తక్కువ మ్యాచ్‌లు) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గవాస్కర్, విరాట్ తర్వాతి స్థానాల్లో దిలీప్ సర్దేశాయ్ (1970/71 విండీస్ పర్యటనలో 642 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (2003/04 ఆస్ట్రేలియా పర్యటనలో 619 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (2002/03 ఇంగ్లండ్ పర్యటనలో 602 పరుగులు), మొహిందర్ అమర్‌నాథ్ (1982/83 విండీస్ పర్యటనలో 598 పరుగులు), విరాట్ కోహ్లి (2018 ఇంగ్లండ్ పర్యటనలో 593 పరుగులు)య ఉన్నారు. ప్రస్తుతం గిల్ (2025 ఇంగ్లండ్ పర్యటనలో 585 పరుగులు) వీరి తర్వాతి స్థానాల్లో ఉన్నాడు.
గిల్ ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 8.. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 269, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే, ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ చారిత్రక గెలుపుకు 7 వికెట్ల దూరంలో ఉంది. అయితే చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు ఎడ్జ్‌బాస్టన్‌లో భారీ వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ఆలస్యమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి.
ఇంగ్లండ్ భారత్ నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.
నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (162 బాల్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.
మరోవైపు టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు.
స్కోర్ వివరాలు..
భారత్ 587 & 427/6 డిక్లేర్
ఇంగ్లండ్ 407 & 72/3 (16) ప్రస్తుత రన్‌రేట్: 4.5