ILT20 2023: Pooran, Fletcher Power MI Emirates Into Qualifier 2 - Sakshi
Sakshi News home page

ILT20 2023: సిక్సర్ల మోత మోగించిన పూరన్‌, ఫ్లెచర్‌.. దద్దరిల్లిన షార్జా స్టేడియం

Feb 10 2023 12:59 PM | Updated on Feb 10 2023 3:03 PM

ILT20 2023: Pooran, Fletcher Power MI Emirates Into Qualifier 2 - Sakshi

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 టోర్నీ చివరి దశకు చేరింది. క్వాలిఫయర్‌-2 బెర్తులతో (గల్ఫ్‌ జెయింట్స్‌, ఎంఐ ఎమిరేట్స్‌) పాటు ఓ ఫైనల్‌ బెర్త్‌ (డెసర్ట్‌ వైపర్స్‌) ఖరారయ్యాయి. గల్ఫ్‌ జెయింట్స్‌, ఎంఐ ఎమిరేట్స్‌ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 10) జరిగే క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ విన్నర్‌ ఫిబ్రవరి 12న జరిగే లీగ్‌ తుది పోరులో డెసర్ట్‌ వైపర్స్‌తో తలపడుతుంది.

ఇక, దుబాయ్‌ క్యాపిటల్స్‌, ఎంఐ ఎమిరేట్స్‌ మధ్య నిన్న జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఎంఐ టీమ్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి దుబాయ్‌ క్యాపిటల్స్‌ను ఇంటికి పంపింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ఎంఐ టీమ్‌.. దుబాయ్‌ క్యాపిటల్స్‌ను 151/5 స్కోర్‌కే పరిమితం చేసింది.

ఎంఐ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. డ్వేన్‌ బ్రావో ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. దుబాయ్‌ ఇన్నింగ్స్‌లో మున్సే (43 బంతుల్లో 51; 6 ఫోర్లు, సిక్స్‌) అర్ధసెంచరీతో రాణించగా.. సికందర్‌ రజా (34 బంతుల్లో 38; 4 ఫోర్లు), రోవ్‌మన్‌ పావెల్‌ (22 బంతుల్లో 30; 3 సిక్సర్లు) పర్వాలేదనిపించారు. 

పేలిన పూరన్‌, ఫ్లెచర్‌.. .. దద్దరిల్లిన షార్జా స్టేడియం

152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎంఐ టీమ్‌.. కేవలం 16.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆండ్రీ ఫ్లెచర్‌ (45 బంతుల్లో 68 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), నికోలస్‌ పూరన్‌ (36 బంతుల్లో 66 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన మెరుపు అర్ధశతకాలతో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. దుబాయ్‌ బౌలర్లలో జేక్‌ బాల్‌, దసున్‌ శనకలకు తలో వికెట్‌ దక్కింది. ముహమ్మద్‌ వసీమ్‌ (2), లోర్కాన్‌ టక్కర్‌ (10) తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా ఫ్లెచర్‌, పూరన్‌ జోడీ బౌండరీలు, సిక్సర్ల మోత మోగించి, తమ జట్టును క్వాలిఫయర్‌-2కు చేర్చారు.  పూరన్‌, ఫ్లెచర్‌ మెరుపు విన్యాసాల ధాటికి షార్జా స్టేడియం దద్దరిల్లింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement