వైభవ్ సూర్యవంశీ (PC: BCCI/IPL)
క్రికెట్ వర్గాల్లో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. పదిహేనేళ్ల వయసులోనే విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న ఈ చిచ్చరపిడుగును చూసి దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా రాణిస్తున్న వైభవ్.. ఐపీఎల్-2026లోనూ దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే.
ఆకాశమే హద్దుగా
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా ఈసారి పూర్తిస్థాయిలో బరిలోకి దిగిన వైభవ్ (Vaibhav Suryavanshi).. ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసే సరికి 680 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో గ్రూప్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ (103).. ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
దిగ్గజాలు ఫిదా
కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించిన వైభవ్.. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఏదేమైనా ఈ సీజన్‌లో ఈ బిహారీ పిల్లాడి ఆట చూసి టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్, సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఫిదా అయ్యారు.
ఈ క్రమంలోనే భారత దిగ్గజ కెప్టెన్ సునిల్ గావస్కర్ సైతం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. వయసుతో పనిలేదని.. అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి అతడు ప్రస్తుతం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా టీమిండియాకు అతడికి ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించాడు.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?
స్పోర్ట్స్ టాక్‌తో మాట్లాడుతూ.. ‘‘టీ20 క్రికెట్ ఆడేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే టీమిండియాలో అతడికి చోటు దక్కుతుందని భావిస్తున్నా. ఇంతటి అత్యద్భుతమైన ప్రదర్శన తర్వాత సెలక్టర్లు అతడికి తప్పక చోటివ్వాలి కూడా!..
అతడి వయసుతో పనిలేదు. 15 ఏళ్ల కంటే పెద్ద వారి కంటే కూడా అతడు శక్తిమంతంగా సిక్సర్లు బాదుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన బౌలర్ల బౌలింగ్‌లోనూ బంతిని బౌండరీ అవతలకు పంపిస్తున్నాడు.
దేవుడిని ప్రార్థిస్తున్నా
ప్రత్యర్థి ఎవరైనా అతడికి అసలు భయమే లేదు. గల్లీల్లో పిల్లలు ఎలా ఆడతారో ఐపీఎల్‌లో ఈ పిల్లాడు అలాగే ఆడుతున్నాడు. మనం కూడా చిన్నపుడు డిఫెన్సివ్‌గా కాకుండా దూకుడుగా ఆడేవాళ్లము. ఇప్పుడు వైభవ్ అదే పని చేస్తున్నాడు.
అయితే, అతడు మెగా వేదికపై ఇలా ఆడటం ఆశ్చర్యకరం. అతడి బ్యాటింగ్ శైలి, ఆట తీరు ఇలాగే కొనసాగాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని సునిల్ గావస్కర్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌లు ఆడిన తర్వాత.. టీమిండియా ఐర్లాండ్, ఇంగ్లండ్, పర్యటనలకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఎంపిక గురించి చర్చ నడుస్తోంది.
చదవండి: ‘జైస్వాల్ రాయల్స్‌ను వదిలేయాలి’
Universe Boss 🤝 Universe Boss Baby#VaibhavSooryavanshi smashes another fifty in #TATAIPL 2026 and breaks Chris Gayle’s record for most sixes in a season (59)🔥👊🏻#TATAIPL Playoffs Eliminator 👉 #SRHvRR | LIVE NOW 👉https://t.co/AsF9BnOMCE pic.twitter.com/dF7JsFwXro
— Star Sports (@StarSportsIndia) May 27, 2026


