
రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో జింబాబ్వేను వారి సొంత దేశంలో ఓడించి (2-0తో) విజయానందంలో ఉన్న శ్రీలంక క్రికెట్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. నిన్న (ఆగస్ట్ 31) జరిగిన రెండో వన్డేలో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ ఐసీసీ లంక జట్టుకు జరిమానా విధించింది.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత సమయంలో తమ కోటా 50 ఓవర్లు పూర్తి చేయలేకపోయింది (ఓ ఓవర్ వెనుకపడింది). ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఇది ఆర్టికల్ 2.22 నిబంధన ఉల్లంఘణ కిందికి వస్తుంది. దీంతో శ్రీలంక జట్టులోని ప్రతి ఆటగాడి మ్యాచ్ ఫీజ్‌లో 5 శాతం కోత విధించారు. ఐసీసీ విధించిన ఈ పెనాల్టీని లంక కెప్టెన్ అసలంక స్వీకరించాడు. దీంతో అతను తదుపరి విచారణ నుంచి మినహాయింపు పొందాడు.
కాగా, స్వదేశంలో శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను జింబాబ్వే 0-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో జింబాబ్వే క్లీన్ స్వీప్ అయినా మంచి మార్కులే కొట్టేసింది. తమ కంటే చాలా రెట్లు పటిష్టమైన శ్రీలంకకు జింబాబ్వే ఆటగాళ్లు ముచ్చెమటలు పట్టించారు. రెండు మ్యాచ్‌ల్లో దాదాపుగా ఓడించినంత పని చేశారు. రెండు వన్డేల్లో శ్రీలంక అతి కష్టం మీద చివరి ఓవర్‌లో బయటపడింది.
నిన్న జరిగిన రెండో వన్డేలో 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ చివరి ఓవర్ మూడో బంతికి గెలుపునందుకుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ పథుమ్ నిస్సంక (136 బంతుల్లో 122; 16 ఫోర్లు) అద్భుతమైన శతకంతో, కెప్టెన్ అసలంక (61 బంతుల్లో 71; 7 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో కదంతొక్కినా చివరి ఓవర్ వరకు గెలుపు కోసం పోరాడాల్సి వచ్చింది. జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి అంత సులువుగా ఓటమిని ఒప్పుకోలేదు.
అంతకుముందు తొలి వన్డేలోనూ ఇంచుమించు ఇలాగే జరిగింది. ఆ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ జింబాబ్వే 291 పరుగుల వద్ద ఆగిపోయింది. చివరి ఓవర్ ముందు వరకు పోరాడిన సికందర్ రజా (92) లక్ష్యానికి 10 పరుగుల దూరంలో ఔట్ కావడంతో పరిస్థితి తారుమారైంది.
లంక బౌలర్ మధుష్క చివరి ఓవర్ తొలి మూడు బంతులకు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు మ్యాచ్‌ను జింబాబ్వే చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. మధుష్క చివరి ఓవర్‌లో చెలరేగకపోయుంటే జింబాబ్వేనే మ్యాచ్ గెలిచేది.