‘ఆఖరి అడ్డంకిని అధిగమిస్తాం’ | ICC launches campaign to promote womens cricket | Sakshi
Sakshi News home page

‘ఆఖరి అడ్డంకిని అధిగమిస్తాం’

Aug 12 2025 5:50 AM | Updated on Aug 12 2025 5:50 AM

ICC launches campaign to promote womens cricket

వన్డే వరల్డ్‌ కప్‌ విజయంపై హర్మన్‌ప్రీత్‌ ఆశాభావం 

టోర్నీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న భారత కెప్టెన్‌

ముంబై: మహిళల క్రికెట్‌లో భారత జట్టు గత కొన్నేళ్లుగా నిలకడైన ప్రదర్శనతో మంచి విజయాలు సాధిస్తోంది. అయితే ఇప్పటికీ వరల్డ్‌ కప్‌ మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. అటు టి20ల్లోనూ, ఇటు వన్డేల్లోనూ మన జట్టు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. 2005, 2017 వన్డే వరల్డ్‌ కప్‌లలో రన్నరప్‌గా నిలిచిన మన జట్టు... 2022లో సెమీఫైనల్‌కే పరిమితమైంది. అయితే ఈసారి గెలుపు గీత దాటుతామని భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ విశ్వాసం వ్యక్తం చేసింది.

 స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో తమకు పలు సానుకూలతలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడింది. సెప్టెంబర్‌ 30 నుంచి నవంబర్‌ 2 వరకు జరిగే ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. 

టోర్నమెంట్‌ మరో 50  రోజుల్లో మొదలు కానున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సోమవారం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది.  ఇందులో హర్మన్‌తో పాటు వైస్‌ కెప్టెన్‌ స్మృతి  మంధాన, జెమీమా రోడ్రిగ్స్, మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్, ఐసీసీ చైర్మన్‌ జై షా, సీఈఓ సంజోగ్‌ గుప్తా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియాతో పాటు 2011 పురుషుల వన్డే వరల్డ్‌ కప్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ యువరాజ్‌ సింగ్‌ పాల్గొన్నారు.  

ఫామ్‌ను కొనసాగిస్తాం... 
ఈ సందర్భంగా మాట్లాడుతూ హర్మన్‌ తమ ఆలోచనలను వెల్లడించింది. ‘సొంత అభిమానుల సమక్షంలో మ్యాచ్‌లు ఆడబోతున్నాం. ఇది ఎప్పుడైనా ప్రత్యేకంగా ఉంటుంది. ఈసారి 100 శాతం మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి విజేతగా నిలిచేందుకు ప్రయతి్నస్తాం. చాలా కాలంగా దీని కోసం ఎదురు చూస్తున్న భారత అభిమానుల కోరిక తీరుస్తాం’ అని హర్మన్‌ వ్యాఖ్యానించింది. 2025లో 11 వన్డేలు ఆడిన భారత జట్టు 9 మ్యాచ్‌లు గెలిచింది.

 ఇందులో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లపై సిరీస్‌ విజయాలతో పాటు శ్రీలంకలో జరిగిన ముక్కోణపు టోర్నీని కూడా జట్టు సొంతం చేసుకుంది. ‘వరుస విజయాలతో నిజంగానే మా జట్టులో ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది. అందరూ ఎలాగైనా గెలవగలమనే పట్టుదల, ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. గత రెండేళ్లుగా మేం చూపించిన నిలకడను మున్ముందు కొనసాగిస్తే చాలు. 

ముఖ్యంగా జట్టు ఎలాంటి బెదురు లేకుండా నిర్భీతిగా ఆడటమే కొత్తగా వచి్చన మార్పు. దాని వల్లే ఈ విజయాలు దక్కాయి’ అని హర్మన్‌ వివరించింది. వరల్డ్‌ కప్‌ ముందు ఇంగ్లండ్‌ గడ్డపై సిరీస్‌ నెగ్గడం జట్టు ఫామ్‌ను చూపిస్తోంది. ‘ఇంగ్లండ్‌లో ఫలితాలు మాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే మా సన్నద్ధత అంత బాగుంది. దీని కోసం మేం చాలా కష్టపడుతున్నాం. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడటం వల్లే ఏ సిరీస్‌ అయినా టోర్నీ అయినా గెలవగలమనే నమ్మకం మాలో పెరిగింది. 

ఇప్పటి వరకు సాధించిన విజయాలతో మేమేమీ అద్భుతం చేసినట్లుగా భావించడం లేదు. విజయాలను మేం అలవాటుగా మార్చుకున్నాం. ఇంకా ఎంతో మెరుగుపడేందుకు అవకాశం కూడా ఉంది’ అని భారత కెప్టెన్‌ విశ్లేషించింది. వరల్డ్‌ కప్‌కు ముందు భారత్‌ స్వదేశంలోనే ఆ్రస్టేలియాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఆసీస్‌తో మ్యాచ్‌ అంటే ఎప్పుడైనా గట్టి సవాల్‌ ఎదురవుతుందని... ఈసారి వారిని ఓడించటంతో పాటు మెగా టోర్నీకి ముందు సరైన సన్నాహకంగా ఉపయోగపడుతుందని హర్మన్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది.  

ఇదో గొప్ప అవకాశం... 
సొంతగడ్డపై వరల్డ్‌ కప్‌ గెలిచి చరిత్ర సృష్టించేందుకు భారత జట్టుకు ఇదో సువర్ణావకాశమని యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. తమ ఆటపై నమ్మకంతో బరిలోకి దిగితే మంచి ఫలితాలు లభిస్తాయని అతను మార్గనిర్దేశనం చేశాడు. ‘వరల్డ్‌ కప్‌ గెలిచేందుకు ఇది మంచి అవకాశం. కానీ మ్యాచ్‌ మొదలు కాగానే గెలుపు గురించి ఆలోచించవద్దు. ముందే ఇలాగే ఆడాలని లెక్కలు పెట్టుకోకుండా పరిస్థితిని బట్టి ఆడాల్సి ఉంటుంది. అన్నింటికంటే ఒత్తిడిని అధిగమించడం ముఖ్యం.

 అనుభవం, మనపై నమ్మకంతో అలాంటి స్థితిని అధిగమించాలి. జట్టులో ప్రతీ ఒక్కరు నేనే మ్యాచ్‌ గెలిపించగలనని నమ్మాలి. అప్పుడే విజయం దక్కుతుంది’ అని యువీ ఉద్బోధ చేశాడు. 2017 వన్డే వరల్డ్‌కప్‌ భారత క్రికెట్‌లో మాత్రమే కాకుండా ప్రపంచ క్రికెట్‌లో కీలక మలుపు అని మిథాలీ రాజ్‌ వ్యాఖ్యానించింది. సోషల్‌ మీడియా ఇంకా ఊపందుకోని ఆ రోజుల్లో ఐసీసీ చాలా పెద్ద స్థాయిలో టోర్నీకి ప్రచారం కల్పించడం ఎంతో మేలు చేసిందని ఆమె అభిప్రాయపడింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement