
నో హ్యాండ్‌షేక్ ఉదంతంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెనక్కు తగ్గింది. ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు పీసీబీ హైడ్రామా నడిపింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తప్పించాలని భీష్మించుకు కూర్చుంది.
పైక్రాఫ్ట్‌ను తప్పించకపోతే యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసింది. మ్యాచ్ ప్రారంభానికి సమయం ఆసన్నమైనా, వారి ఆటగాళ్లను హోటల్ రూమ్‌ల నుంచి బయటకు రానివ్వలేదు.
దీంతో ఆసియా కప్‌లో పాక్ కొనసాగడంపై కాసేపు నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ విషయంలో ఐసీసీ కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డే తోక ముడిచింది. నో హ్యాండ్‌షేక్ ఉదంతంతో పైక్రాఫ్ట్‌ది ఏ తప్పు లేదని ఐసీసీ మరోసారి పీసీబీకి స్పష్టం చేసింది. మ్యాచ్ అఫీషియల్స్ విషయంలో పీసీబీ అతిని సహించబోమని స్ట్రిక్ట్‌గా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.
దీంతో చేసేదేమీ లేక పీసీబీ తమ ఆటగాళ్లను మ్యాచ్ ఆడటానికి మైదానానికి రావాల్సిందిగా ఆదేశించింది. మ్యాచ్‌ను గంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్వహకులకు కబురు పంపింది. భారతకాలమానం ప్రకారం పాక్-యూఏఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది.
కాగా, పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
అలాగే ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని గగ్గోలు పెట్టింది.
పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్‌హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని, యూఏఈతో మ్యాచ్‌కు అతన్నే రిఫరీగా కొనస్తామని ప్రకటించింది.