ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ (Chris Broad) టీమిండియాపై సంచలన ఆరోపణలు చేశాడు. పలు మ్యాచ్‌లలో భారత జట్టు చేసిన తప్పులను కప్పి పుచ్చాలంటూ తనకు ఫోన్లు వచ్చాయని.. రాజకీయ జోక్యం వల్లే ఒత్తిళ్లు పెరిగాయని ఆరోపించాడు.
కాగా ఇంగ్లండ్ దిగ్గజ పేసర్లలో ఒకడైన స్టువర్ట్ బ్రాడ్ (Stuard Broad) తండ్రే క్రిస్ బ్రాడ్. ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 25 టెస్టుల్లో 1661, 34 వన్డేల్లో 1361 పరుగులు చేశాడు. అనంతరం 2003- 2024 వరకు ఐసీసీ మ్యాచ్ రిఫరీగా పనిచేశాడు క్రిస్ బ్రాడ్.
కాంట్రాక్టును పునరుద్ధరించని ఐసీసీ
మొత్తంగా 123 టెస్టులు, 361 వన్డేలు, 138 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు బ్రాడ్ రిఫరీగా పనిచేశాడు. అయితే, ఇంకొన్నాళ్లు కొనసాగాలని చూసినా ఐసీసీ అతడి కాంట్రాక్టును పునరుద్ధరించలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా ‘ది టెలిగ్రాఫ్‌నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రాడ్ మాట్లాడుతూ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆనాటి మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్ల కంటే ఇండియా మూడు, నాలుగు ఓవర్లు వెనుకబడి ఉంది.
అక్కడ ఉంది టీమిండియా
జరిమానా పడే పరిస్థితి నెలకొంది. ఇంతలో నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘ఉదారంగా వ్యవహరించండి. ఎందుకంటే అక్కడ ఉంది టీమిండియా’ అని నాకు సందేశం వచ్చింది. సరే మరేం పర్లేదు అనుకున్నా.
గంగూలీ నా మాట లెక్కచేయలేదు
తగినంత సమయం దొరకడంతో చెప్పినట్లే చేశాం. అయితే, ఆ తర్వాతి మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతమైంది. స్లో ఓవర్ రేటు నివారించేలా చర్యలు తీసుకోవాలని సౌరవ్ గంగూలీకి చెప్పినా అతడు నా మాట లెక్కచేయలేదు.
అంతలో మళ్లీ ఫోన్.. ‘నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు?’ అని అడిగాను. ఇందుకు బదులుగా.. ‘అతడు (గంగూలీ) ఏం చేస్తే అదే చేయనివ్వండి’ అనే సమాధానం వచ్చింది. అంతా రాజకీయం. అప్పటి నుంచే క్రీడల్లో రాజకీయ జోక్యం మొదలైంది. ఇంకా నయం నేను ఇంకా ఆ పదవిలో లేను.
కానీ 20 ఏళ్ల పాటు నాపైకి ఎన్నో ‘బుల్లెట్లు’ దూసుకువచ్చాయి. రాజకీయ జోక్యం వల్ల సమస్యలు వచ్చాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. ‘20 ఏళ్ల సుదీర్ఘ సమయం. ఎలా తట్టుకున్నానో అనిపిస్తుంది’’ అని క్రిస్ బ్రాడ్ ఆరోపణలు చేశాడు. అయితే, టీమిండియా ఆడిన ఏ మ్యాచ్ విషయంలో తాను ఇలాంటి ఒత్తిళ్లకు గురయ్యానన్నది మాత్రం అతడు స్పష్టంగా చెప్పలేదు.
అందుకే ఆరోపణలా?
కాగా ఐసీసీ తన కాంట్రాక్టును పునరుద్ధరించకపోవడాన్ని దృష్టిలో పెట్టుకునే బ్రాడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఐసీసీ ప్రస్తుత చైర్మన్‌గా.. బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఉన్న విషయం తెలిసిందే.
చదవండి: క్రికెట్ ఒక్కటే జీవితం కాదు.. కోహ్లి నన్ను బాగా అర్థం చేసుకుంటాడు: రోహిత్ శర్మ


