డియర్ క్రికెట్ మరో ఛాన్స్ ఇవ్వు అంటూ ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ (Karun Nair).. ఇచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోలేక, ఇలా వచ్చి అలా మాయమయ్యాడు. ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన నాయర్.. 7 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 205 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
ఫలితంగా తదుపరి సిరీస్‌కే జట్టులో స్థానం కోల్పోయాడు. ఆతర్వాత అతనికి 'ఏ' జట్టులోనూ స్థానం లభించలేదు. సెలెక్టర్లు కరుణ్ నుంచి చాలా ఆశించామని చెప్పి చేతులు దులుపుకున్నారు. తాజాగా కరుణ్ మరోసారి 'మరో ఛాన్స్' అంటూ ముందుకు వచ్చాడు.
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో అర్ద సెంచరీ (73), రెండో మ్యాచ్‌లో భారీ సెంచరీ (174 నాటౌట్) చేసి సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. సెంచరీ అనంతరం కరుణ్ విలేకరులతో మాట్లాడుతూ ఇలా అన్నాడు.
"టీమిండియా నుంచి తప్పించడం బాధ కలిగించింది. ఒక్క సిరీస్ కంటే ఎక్కువ అర్హుడినని నన్ను నేను ఒప్పించుకుంటూ ఉంటాను. గత రెండు సంవత్సరాల నా ప్రదర్శన చూస్తే, ఆ స్థాయికి అర్హుడిననే అనిపిస్తుంది. ప్రస్తుతం నా పని పరుగులు చేయడం ఒక్కటే. దేశం కోసం ఆడాలన్నదే నా లక్ష్యం. అది సాధపడకపోతే, నా జట్టుకు విజయాన్ని అందించడమే తదుపరి లక్ష్యం"
కరుణ్ చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే అతనిలో నిరాశతో కూడిన ఆశ కనిపిస్తుంది. క్రికెట్.. మరోసారి మరో ఛాన్స్ ఇవ్వు అంటూ అర్దించినట్లనిపిస్తుంది. దేశం కోసం ఆడాలన్న తాపత్రయం స్పష్టమవుతుంది.
33 ఏళ్ల కరుణ్‌కు ఇంగ్లండ్ పర్యటనలో మంచి ఆరంభాలు లభించినా దురదృష్టవశాత్తు వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కరుణ్ కష్టమైన పిచ్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడినా తగిన గుర్తింపు దక్కలేదు. ఆ ఇన్నింగ్స్‌లో ఇరు జట్లలో కరుణే టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
వాస్తవానికి కరుణ్‌కు అతి భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం ఉంది. ఇది చాలాసార్లు నిరూపితమైంది. ఇలాంటి ఆటగాడికి కొన్ని అవకాశాలు మాత్రమే ఇవ్వడం సబబు కాదు. కరుణ్‌కు కనీసం దక్షిణాఫ్రికా 'ఏ' సిరీస్‌తో అయినా భారత ఏ జట్టుకు ఎంపిక చేసి ఉండాల్సింది. అక్కడ ప్రదర్శనను బట్టి అతని భవిష్యత్తును డిసైడ్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకో సెలెక్టర్లు కరుణ్ విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే భావన కలుగుతుంది.
చదవండి: చారిత్రక ఘట్టం.. భారత క్రికెట్ ప్రయాణంలో మరిచిపోలేని అధ్యాయం


