1930ల్లో భారత క్రికెట్ అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెడుతున్న వేళ, దేశీయ క్రికెట్‌కు బలం చేకూర్చే దిశగా 1934లో "క్రికెట్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ ఇండియా" పేరిట ఓ దేశీయ టోర్నీ ప్రారంభమైంది.
ఈ టోర్నీ 1935-36లో (రెండో ఎడిషన్) రూపాంతరం చెంది రంజీ ట్రోఫీగా (Ranji Trophy) మారింది. తొలి రెండు ఎడిషన్లలో బాంబే (Bombay) ఛాంపియన్‌గా అవతరించింది.
ఈ టోర్నీ మూడో ఎడిషన్ (1936-37) ఓ చారిత్రక ఘట్టానికి వేదికైంది. ఓ విదేశీ ఆటగాడు భారత దేశ అత్యుత్తమ క్రికెట్ టోర్నీ అయిన రంజీ ట్రోఫీని కైసవం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన అల్బర్ట్ ఫ్రెడ్రిక్ వెన్ల్సే (Albert Frederick Wensley) నావానగర్ (Nawanagar) అనే జట్టుకు నేతృత్వం వహించి ఛాంపియన్‌గా నిలబెట్టాడు.
తద్వారా ఫ్రెడ్రిక్ రంజీ ట్రోఫీ గెలిచిన తొలి విదేశీ కెప్టెన్‌గా చరిత్రలో నిలిచాడు. ఆల్‌రౌండర్ అయిన ఫ్రెడ్రిక్ కోచ్‌గా వచ్చి, ఆటగాడిగా మారి నావానగర్‌కు తొలి టైటిల్ అందించాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇది మరిచిపోలేని అధ్యాయం.
బాంబేలోని జింంఖానా మైదానంలో బెంగాల్‌తో జరిగిన ఫైనల్లో నావానగర్ అద్భుత ప్రదర్శన చేసి ఛాంపియన్‌గా అవతరించింది. 1937, ఫిబ్రవరి 6-10 మధ్యలో జరిగిన ఆ మ్యాచ్‌లో నావానగర్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ (424) చేసింది. వినూ మన్కడ్ (185) సెంచరీతో కదంతొక్కాడు. సోరబ్జీ కోలా (66) అర్ద సెంచరీతో రాణించాడు.
అనంతరం బరిలోకి దిగిన బెంగాల్.. ఫ్రెడ్రిక్ వెన్ల్సే (4/93) ధాటికి 315 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్ ఇన్నింగ్స్‌లో పాల్ వాన్ డర్ గచ్ట్ (79) అర్ద సెంచరీతో రాణించాడు.
109 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నావానగర్ 383 పరుగులకు ఆలౌటై, బెంగాల్ ముందు 493 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో ఫ్రెడ్రిక్ వెన్ల్సే (4/46) మరోసారి చెలరేగడంతో బెంగాల్ 236 పరుగులకే ఆలౌటై, 256 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఫ్రెడ్రిక్ వెన్ల్సే అద్భుతమైన బౌలింగ్‌తో నావానగర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఓ విదేశీ ఆటగాడు కోచ్‌గా వచ్చి, కెప్టెన్‌గా మారి, ఛాంపియన్‌గా నిలిచిన ఈ ప్రయాణం భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయింది. ఈ ఘట్టం రంజీ ట్రోఫీకి అంతర్జాతీయ గౌరవాన్ని తెచ్చింది.
ఫ్రెడ్రిక్ వెన్ల్సే తర్వాత టామ్ లాంగ్‌ఫీల్డ్, హెర్బర్ట్ బారిట్ అనే ఇంగ్లీష్ ఆటగాళ్లు బెంగాల్ (1938-39), వెస్ట్రన్ ఇండియా (1943-44) జట్లను రంజీ ఛాంపియన్లుగా నిలబెట్టారు.
చదవండి: యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం


