
టీమిండియాలోకి వచ్చిన మూడేళ్ల కాలంలోనే కెప్టెన్‌గా ఎదిగాడు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni). 2004లో బంగ్లాదేశ్‌తో వన్డే సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ జార్ఖండ్ డైనమైట్.. 2007లో సారథిగా పగ్గాలు చేపట్టాడు. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
దశాబ్దకాలం భారత జట్టు కెప్టెన్‌గా కొనసాగిన ధోని.. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా, మేటి ఫినిషర్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాదు భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఏకైక సారథి కూడా అతడే!
ఓ కొత్త ‘వేషం’.. ఊసరవెళ్లిలా మారిపోయా
అయితే, జాతీయ జట్టులోకి ధోని రాకతో టీమిండియాలో వికెట్ కీపర్‌గా చోటు కోల్పోయిన ఆటగాళ్లలో దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) ఒకడు. అప్పట్లో తనపై ఒత్తిడి తీవ్రంగా ఉండేదని.. ఎప్పటికప్పుడు తాను ఓ కొత్త ‘వేషం’తో.. ఊసరవెళ్లిలా మారిపోయానని డీకే తాజాగా గుర్తుచేసుకున్నాడు.
‘‘అలాంటి వ్యక్తి ఓ జట్టులోకి వచ్చినపుడు మన మీద మనకే సందేహాలు వస్తాయి. నాలోని అత్యుత్తమ ఆటను వెలికితీయాలనే కసి పెరుగుతుంది. అప్పుడే నేను ఓ ఊసరవెళ్లిలా మారిపోయాను.
తీవ్రమైన ఒత్తిడి
ఒకవేళ ఓపెనింగ్ స్థానం ఖాళీగా ఉందంటే.. తమిళనాడు జట్టులో ఓపెనర్‌గా అవకాశం ఇస్తారా సర్ అని మా వాళ్లను అడిగేవాడిని. ఓపెనర్‌గా వచ్చి పరుగులు సాధించేందుకు కృషి చేసేవాడిని. అదే విధంగా.. టీమిండియాలో మిడిలార్డర్‌లో స్థానం ఖాళీగా ఉందంటే.. అక్కడ బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించేవాడిని. అసలు నాకపుడు ఏం కావాలో నాకే అర్థమయ్యేది కాదు. తీవ్రమైన ఒత్తిడి.
ధోని జట్టులోకి రాకముందు అతడి ఆట తీరు గురించి నాకు తెలియదు. అయితే, కెన్యాతో ‘ఎ’ సిరీస్‌లో ఓ ఆటగాడు అదరగొట్టారని అంతా అతడి గురించే మాట్లాడుకుంటున్నారు. బంతిని బలంగా బాదడంలో అతడు దిట్ట అని చెప్పారు.
గ్యారీ సోబర్స్‌తో పోలిక
కొంతమంది ఏకంగా భారీ సిక్సర్లు బాదే గ్యారీ సోబర్స్‌తో పోల్చారు. ఎంఎస్ ధోని బ్యాటింగ్ టెక్నిక్ విభిన్నంగా ఉంటుంది. అలాంటి ఫినిషర్ మరొకరు లేరంటూ అప్పట్లోనే చర్చ నడిచేది’’ అని 40 ఏళ్ల దినేశ్ కార్తిక్ ఇండియా టుడే ఎన్‌క్లేవ్ సౌత్-2025లో గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నాడు.
కోచ్‌గా మారిన డీకే
కాగా 2004 నుంచి 2022 వరకు దినేశ్ కార్తిక్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్ మొత్తంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 94 వన్డేలు, 60 అంతర్జాతీయ టీ20లు, 26 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1752, 686, 1025 పరుగులు సాధించాడు.
ఇక ఐపీఎల్‌లో 257 మ్యాచ్‌లు ఆడిన డీకే 4842 పరుగులు చేశాడు. గతేడాది క్యాష్‌రిచ్ లీగ్‌కు కూడా గుడ్‌బై చెప్పిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు. ఈ ఏడాది ఆర్సీబీ తమ మొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన విషయం తెలిసిందే. మరోవైపు.. డీకే విదేశీ లీగ్ క్రికెట్‌లో ఆడుతుండటం విశేషం.
చదవండి: Ro- Ko: ‘ఎవరూ తోపులు కారు.. నేనే దేవుడిని అనుకుంటే ఇలాగే ఉంటుంది’