
హరియాణా జట్టుకు 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన హైదరాబాద్
ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీ
చెన్నై: వరుసగా రెండో ఏడాది ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లేందుకు డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ జట్టు మరో ఎనిమిది వికెట్ల దూరంలో ఉంది. హరియాణాతో జరుగుతున్న నాలుగు రోజుల సెమీఫైనల్ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్‌దే పైచేయిగా ఉంది. హైదరాబాద్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరియాణా ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 6 పరుగులు చేసింది.
హరియాణా చేజార్చుకున్న రెండు వికెట్లు నితిన్ సాయి యాదవ్‌కు లభించాయి. చివరిరోజు బుధవారం విజయం అందుకోవాలంటే హరియాణా మరో 266 పరుగులు చేయాలి. హైదరాబాద్ నెగ్గాలంటే ఎనిమిది వికెట్లు తీయాలి. అంతకుముందు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ గౌడ్ (41; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా... హిమతేజ (31; 2 ఫోర్లు), రాహుల్ రాదేశ్ (31; 1 ఫోర్) కూడా రాణించారు. హరియాణా బౌలర్లలో అమిత్ రాణా మూడు వికెట్లు తీయగా... నిఖిల్ కశ్యప్, పార్థ్ వత్స్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు.
హరియాణా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 79.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ హిమాన్షు రాణా (75; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. హైదరాబాద్ బౌలర్లు రోహిత్ రాయుడు 65 పరుగులిచ్చి 5 వికెట్లు... వరుణ్ గౌడ్ 27 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి హరియాణాను కట్టడి చేశారు. 17 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ 99.4 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది.
వరుణ్ గౌడ్ (91; 4 ఫోర్లు) తొమ్మిది పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకోగా... హిమతేజ (41; 3 ఫోర్లు), అమన్ రావు (35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నారు. హరియాణా బౌలర్లలో నిఖిల్ కశ్యప్ 80 పరుగులిచ్చి 5 వికెట్లు... పార్థ్ వత్స్ 49 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు.