హాంగ్ కాంగ్ సిక్సెస్- 2025 టోర్నమెంట్‌ను భారత జట్టు ఓటమితో ముగించింది. ఆదివారం శ్రీలంకతో జరిగిన బౌల్ గ్రూపు మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 138 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
లాహిరు సమరకూన్(14 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 52), కెప్టెన్ మధుశంక(15 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో ప్రతీ ఒక్కరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
అనంతరం 139 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటర్లలో భరత్ చిప్లి(13 బంతుల్లో 41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ స్టువర్ట్ బిన్నీ(9 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్స్‌లతో 25) మెరుపులు మెరిపించాడు.
ఈ టోర్నీలో భారత్‌కు ఇది నాలుగో ఓటమి. అంతకుముందు కువైట్, యూఏఈ, నేపాల్ వంటి పసికూనల చేతిలో మెన్ ఇన్ బ్లూ పరాజయం పాలైంది. దినేష్ కార్తీక్, రాబిన్ ఊతప్ప, బిన్నీ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికి కూడా భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది.


