వెస్టిండీస్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20 అభిమానులను ఆఖరివరకు మునివేళ్లపై నిలబెట్టింది. నెల్సన్ వేదికగా నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో 9 పరుగుల తేడాతో విండీస్ ఓటమి పాలైంది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్ జట్టు 19.5 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది.
లక్ష్య చేధనలో వెస్టిండీస్ 88 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్, టెయిలాండర్ బ్యాటర్ స్ప్రింగర్ కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ బౌండరీల వర్షం కురిపించారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో తమ జట్టును విజయానికి చేరువ చేశారు.
అయితే 19 ఓవర్‌లో ఆఖరి బంతికి స్ప్రింగర్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) ఔట్ కావడంతో కివీస్ మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి ఓవర్‌లో విండీస్ విజయానికి 12 పరుగులు అవసరమవ్వగా.. జామిసన్ కేవలం రెండు రన్స్ మాత్రమే ఇచ్చాడు. షెపర్డ్(34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49) ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. బ్లాక్‌క్యాప్స్ బౌలర్లలో జాకబ్ డఫీ, ఇష్ సోధి చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. జామిసన్, బ్రెస్‌వెల్, శాంట్నర్ తలా వికెట్ సాధించారు.
కాన్వే సూపర్ హాఫ్ సెంచరీ..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీ సాధించగా.. మిచెల్(41), రవీంద్ర(26) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. విండీస్ బౌలర్లలో ఫోర్డ్, హోల్డర్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ విజయంతో కివీస్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 నెల్సన్ వేదికగా సోమవారం జరగనుంది.


