మొన్న టీ20లకు రిటైర్మెంట్‌.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం! | Kane Williamson opts out of New Zealands ODI squad | Sakshi
Sakshi News home page

Kane Williamson: మొన్న టీ20లకు రిటైర్మెంట్‌.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం!

Nov 7 2025 10:58 AM | Updated on Nov 7 2025 12:13 PM

Kane Williamson opts out of New Zealands ODI squad

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు శుక్రవారం వెల్లడించింది. ఈ సిరీస్‌కు  స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. వర్క్‌లోడ్‌ మెనెజ్‌మెంట్‌లో భాగంగా ఈ సిరీస్‌ నుంచి కేన్‌ తప్పుకొన్నాడు.

ఇటీవల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విలియమ్సన్..ఇకపై ఎక్కువగా టెస్ట్ ఫార్మాట్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.  వన్డేల్లో న్యూజిలాండ్‌ తరపున అత్యధిక పరుగులు  (7256 పరుగులు, సగటు 48.70) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న కేన్‌ మామ.. ఫిట్‌నెస్‌ పరంగా మాత్రం అతడు గత కొంతకాలంగా సతమవుతున్నాడు. 

విండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ సమయానికి  పూర్తి ఫిట్‌గా ఉండేందుకే వన్డేలకు దూరంగా ఉండాలని విలియమ్సన్‌ నిర్ణయించుకున్నాడు. ఈ కివీస్‌ మాజీ కెప్టెన్‌ త్వరలోనే వన్డేలకు కూడా వీడ్కోలు పలికే ఛాన్స్‌ ఉంది. ఐపీఎల్‌-2026 సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ వ్యూహాత్మక సలహాదారుడిగా కేన్‌ పనిచేయనున్నాడు.

ఇక గాయం కారణంగా ఇంగ్లండ్‌తో ఆఖరి రెండు వన్డేలకు దూరమైన స్టార్‌ పేసర్‌ మాట్‌ హెన్రి తిరిగి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా  ఇంగ్లండ్‌ సిరీస్‌లో  అద్భుతంగా రాణించిన పేసర్‌ బ్లెయిర్ టిక్నర్‌కు మరోసారి జట్టులో చోటు లభించింది. ఈ జట్టుకు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ శాంట్నర్‌ నాయకత్వం వహించనున్నాడు. 

మరోవైపు మహ్మద్ అబ్బాస్, ఫిన్ అలెన్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, బెన్ సియర్స్ వంటి ఆటగాళ్లు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో లేరు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ నవంబర్‌ 16 నుంచి క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా ప్రారంభం కానుంది.

విండీస్‌తో వన్డేలకు కివీస్‌ జట్టు
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్
చదవండి: పాకిస్తాన్‌ కెప్టెన్‌ విధ్వంసం.. 12 బంతుల్లో హాఫ్‌ సెంచరీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement