Viral Video: తండ్రి బౌలింగ్‌ను చెడుగుడు ఆడుకున్న తనయుడు | Hassan Eisakhil Welcomed His Father Mohammad Nabi With A Six In Shpageeza Cricket League | Sakshi
Sakshi News home page

Viral Video: తండ్రి బౌలింగ్‌ను చెడుగుడు ఆడుకున్న తనయుడు

Jul 22 2025 5:35 PM | Updated on Jul 22 2025 5:39 PM

Hassan Eisakhil Welcomed His Father Mohammad Nabi With A Six In Shpageeza Cricket League

ఆఫ్ఘనిస్తాన్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ నబీ, అతని పెద్ద కొడుకు హసన్ ఐసాఖిల్‌ (18) ష్పగీజా క్రికెట్ లీగ్ 2025లొ ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఈ లీగ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో తండ్రి నబీ బౌలింగ్‌ను కొడుకు హసన్ ఐసాఖిల్‌ చెడుగుడు ఆడుకున్నాడు. తండ్రి బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే హసన్ ఐసాఖిల్‌ భారీ సిక్సర్‌గా మలిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

ఈ వీడియోకు నెటిజన్లను నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. 40 ఏళ్ల నబీ కొడుకు హసన్ ఐసాఖిల్‌తో కలిసి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలని ఆరాటపడుతున్నాడు. హసన్‌ గతేడాది అండర్‌-19 వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించి జాతీయ జట్టు నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు. హసన్‌ రైట్‌ హ్యాండ్‌ ఓపెనింగ్‌ బ్యాటింగ్‌ చేస్తాడు. హసన్‌ ఆఫ్ఘనిస్తాన్‌-ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తాడు.  

హసన్‌ విధ్వంసకర శతకం
హసన్‌ గతేడాది తొలిసారి వార్తల్లో నిలిచాడు. కాబుల్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో 45 బంతుల్లో 150 పరుగులు చేసి రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో హసన్‌ రికార్డు స్థాయిలో 19 సిక్సర్లు కొట్టాడు.  

సుదీర్ఘ ఫార్మాట్‌లో మరో శతకం
హసన్ ఇదే ఏడాది స్వదేశంలో జరిగిన ఓ ఇంటర్‌ రీజియన్‌ టోర్నీలో (మెర్వైస్ నికా రీజినల్ 3-డే ట్రోఫీ) భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఆ టోర్నీలో హసన్‌.. బాంద్-ఎ-అమీర్‌తో జరిగిన మ్యాచ్‌లో 235 బంతుల్లో 143 పరుగులు  చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో హసన్‌కు ఇది తొలి సెంచరీ.

కొడుకు కోసం ఇంకా కొనసాగుతున్న నబీ
40 ఏళ్ల నబీ వయసు పైబడినా కొడుకు కోసం అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంకా కొనసాగుతున్నాడు. టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన నబీ.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఆడుతూనే ఉన్నాడు. 2009లో వన్డేల్లో, 2010లో టీ20ల్లోకి అరంగేట్రం చేసిన నబీ.. 173 వన్డేలు, 132 టీ20లు ఆడి 2 సెంచరీలు, 23 అర్ద సెంచరీల సాయంతో దాదాపు 6000 పరుగులు చేశాడు. 

బౌలింగ్‌లో 273 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం నబీకి జాతీయ జట్టు తరఫున పెద్దగా అవకాశాలు రాకపోయిన  ప్రపంచవాప్తంగా జరుగుతున్న ప్రైవేట్‌ టీ20 లీగ్‌ల్లో బిజీగా ఉన్నాడు. నబీ 2017 నుంచి గతేడాది వరకు ఐపీఎల్‌లోనూ అలరించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement