
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భారత జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. ఆదివారం ఇండోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 289 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చివరి ఓవర్లలో తడబడిన భారత జట్టు.. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది.
ఇది భారత్‌కు వరుసగా మూడో ఓటమి. ఈ ఓటమితో భారత్ సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలిస్తేనే మన అమ్మాయిల జట్టు నేరుగా సెమీఫైనల్స్‌కు ఆర్హత సాధించనుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించింది. స్మృతి మంధాన వికెట్‌తో మ్యాచ్ ఇంగ్లండ్ వైపు టర్న్ అయిందని హర్మన్ చెప్పుకొచ్చింది.
"గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది. స్మృతీ మంధాన వికెట్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటివరకు మేము గేమ్‌లో ఉన్నాము. ఈజీగా గెలుస్తామనుకున్నాము. మంధాన వికెట్ పడిన తర్వాతే మేము పట్టు కోల్పోయాము. కానీ ఇంగ్లండ్ బౌలర్లకు కూడా క్రెడిట్ ఇవ్వాలి.
వారు ఆఖరి వరకు అద్భుతంగా బౌలింగ్ చేసి మాపై ఒత్తడి పెంచారు. వరుస క్రమంలో వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాము. ప్రతీది మేము అనుకున్నట్లు సాగింది. కానీ చివరి ఐదు-ఆరు ఓవర్లలో విఫలమయ్యాము.
నిజంగా మాకు ఇది హార్ట్ బ్రేకింగ్ మూమెంట్. గత కొంతకాలంగా మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగిస్తున్నాము. కానీ దురదృష్టవశాత్తూ ఓడిపోతున్నాము. మాకు తదుపరి మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచి విజయం సాధిస్తాము అని ఆశిస్తున్నాను.
ఈ మ్యాచ్‌లో బౌలర్లు కూడా మెరుగ్గా రాణించారు. నాట్ స్కీవర్, హీథర్ క్రీజులో ఉన్నప్పుడు ఇంగ్లండ్ భారీ స్కోర్ చేస్తుందని భావించాము. కానీ మా బౌలర్లు కమ్‌బ్యాక్ ఇచ్చి వారిని 300 పరుగులలోపు కట్టడి చేశారు. కానీ బౌలింగ్‌లో కూడా చివరి ఐదు ఓవర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నాము. మేము ఈ విషయంపై డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకుంటున్నాము.
ఈ మ్యాచ్‌లో అదనపు బౌలర్‌తో ఆడాలనుకున్నాము. అందుకే జెమిమా స్దానంలో రేణుకాను ఆడించాలనుకున్నాము. స్మతి, నేనూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాము. ఆ తర్వాత రిచా, అమన్ జోత్, దీప్తి లాంటి ప్లేయరర్లు ఉండడంతో ఈజీగా గెలుస్తామనుకున్నాము. ఏదేమైనప్పటికి ఈరోజు అదృష్టం మా వైపు లేదు. తర్వాత మ్యాచ్‌లో తిరిగి పుంజుకుంటామన్న నమ్మకం ఉంది అని హర్మన్ పేర్కొంది.
చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్