సంచ‌ల‌నాల సూర్య‌వంశీ! | Happy Birthday Vaibhav Sooryavanshi: Set For Another Stellar IPL Season | Sakshi
Sakshi News home page

HBD Vaibhav Sooryavanshi: సంచ‌ల‌నాల సూర్య‌వంశీ!

Mar 27 2026 11:17 AM | Updated on Mar 27 2026 12:36 PM

Happy Birthday Vaibhav Sooryavanshi: Set For Another Stellar IPL Season

అత‌డు కూడా అంద‌రిలా సాధార‌ణంగా క్రికెట్ ఆడుకుంటూ పోతే పెద్ద‌గా గుర్తింపు వ‌చ్చేది కాదేమో. కానీ 12 ఏళ్ల‌కే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి ఆడ‌కముందే రికార్డు సృష్టించాడు. ఇక బ్యాట్ ప‌ట్టి క‌ద‌నరంగంలోకి దూకిన త‌ర్వాత బ్యాట్‌కు అలుపొచ్చిందేమో కానీ అత‌డి పరుగుల దాహం కొనసాగుతూనే వస్తోంది.

14 ఏళ్ల‌కే ఐపీఎల్‌లో అడుగుపెట్టి సంచ‌ల‌నం సృష్టించిన ఆ బుడ‌త‌డు ఇటీవ‌లే ముగిసిన అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టాడు. ఆ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో 55 బంతుల్లోనే 175 ప‌రుగులు సాధించి ఔరా అనిపించాడు. కేవ‌లం 14 ఏళ్ల వ‌య‌సులోనే ప‌వ‌ర్‌హిట్టింగ్‌తో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా మారాడు బీహార్ చిన్నోడు వైభ‌వ్ సూర్య‌వంశీ.

ఇవాళ వైభవ్‌ సూర్యవంశీ 15వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నాడు. స‌చిన్ లాగే 15 ఏళ్ల వ‌య‌సులో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న వైభ‌వ్ సూర్య‌వంశీ కోరిక నెర‌వేరాల‌ని ఆశిద్దాం. హ్యాపీ బ‌ర్త్‌డే టూ వైభ‌వ్ సూర్య‌వంశీ..

క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ మార్చి 27తో మ‌రో మైలురాయిని అందుకున్నాడు.  ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు వైభవ్ తన 15వ పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. గతేడాది 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ బీహార్ కుర్రాడు, ఇప్పుడు 15వ ఏట అడుగుపెడుతూ మరింత జోరు చూపించడానికి సిద్ధమయ్యాడు.

15వ పుట్టినరోజు సందర్భంగా వైభవ్ సూర్య‌వంశీ తన లక్ష్యాలను పంచుకున్నాడు. ఈసారి రాజస్థాన్ రాయల్స్‌కు ఐపీఎల్ టైటిల్ అందించడమే తన ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నాడు.  ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ పేరిట ఉన్న‌ 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టాలనేది త‌న చిర‌కాల కోరిక అని వైభ‌వ్ పేర్కొన్నాడు. 

త్వరలో జాతీయ జట్టులోకి..
ఇప్ప‌టికే అండ‌ర్‌-19 జూనియ‌ర్ స్థాయి క్రికెట్‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లోనే 175 ప‌రుగుల ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్ ఆడి బీసీసీఐ సెలెక్ట‌ర్ల దృష్టిలో ప‌డ్డాడు. ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక ఆట‌గాడు సీనియ‌ర్ జ‌ట్టు త‌ర‌ఫున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు క‌నీసం 15 ఏళ్లు ఉండాల‌న్న‌ది నిబంధ‌న‌. 

తాజాగా వైభ‌వ్ సూర్య‌వంశీ 15వ ఏట అడుగుపెట్ట‌డంతో సీనియ‌ర్ జ‌ట్టు లోకి తొంద‌ర్లోనే పిలుపు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అండ‌ర్‌-19 క్రికెట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు వైభ‌వ్ సూర్య‌వంశీ 18 మ్యాచ్‌లు ఆడి 701 ప‌రుగులు సాధించాడు.  ఇందులో మూడు సెంచ‌రీలు, ఒక అర్థ‌సెంచ‌రీ ఉన్నాయి.

హోంగ్రౌండ్‌లో వేడుకలు..
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తన మొదటి మ్యాచ్‌ను మార్చి 30న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. రాజస్థాన్ రాయల్స్‌కు ఇది రెండో హోమ్ గ్రౌండ్ కావడంతో జట్టు సభ్యులందరూ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. వైభవ్ సూర్యవంశీ కూడా టీమ్‌తోనే ఉన్నాడు. దీంతో తన 15వ పుట్టినరోజు వేడుకలు తన జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ సొంత ఊరైన గౌహతిలోనే జరగనున్నాయి. వరుసగా రెండో ఏడాది వైభవ్ తన పుట్టినరోజును ఐపీఎల్ ఫ్రాంచైజీతో జరుపుకోవడం విశేషం.

ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు జ‌రిగిన వేలంలోకి వైభవ్  సూర్యవంశీ ఎంట్రీ ఇవ్వడంతోనే రికార్డు లిఖించాడు. ఆ త‌ర్వాత రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అత‌డిని రూ. 1.1 కోట్ల‌కు ద‌క్కించుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచింది.  ఆ సీజ‌న్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున 7 మ్యాచ్‌లు ఆడిన వైభవ్, ఏకంగా 252 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 200 కంటే ఎక్కువగా ఉండటం విశేషం.

ద్రవిడ్‌ పర్యవేక్షణలో..
రాజస్థాన్ రాయల్స్ జట్టులో ప్రస్తుతం వైభవ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. టీమ్ మెంటార్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో వైభవ్ తన ఆటను మెరుగుపరుచుకుంటున్నాడు. రియాన్ పరాగ్ వంటి యువ కెప్టెన్ తోడుండటంతో వైభవ్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బర్త్‌డే వేడుకల అనంతరం వైభవ్ తిరిగి నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. 

రైతు కొడుకు నుంచి క్రికెటర్‌ దాకా..
2011 మార్చి 27న బీహార్‌లోని తాజ్‌పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. నాలుగేళ్ల వయసులోనే క్రికెట్‌పై వైభ‌వ్ పెంచుకున్న మ‌క్కువ‌ అతని తండ్రి సంజీవ్‌కి అర్థమైంది. వెంటనే తన ఇంటి వెనుక భాగంలో వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆయనే స్వయంగా రోజంతా కష్టపడి ఆ స్థలం అంతా చదును చేసి కొడుకు కోసం చిన్న ప్లే గ్రౌండ్‌ తయారు చేసి ఇచ్చాడు. 

అలా ఇంటి వెనుక వైభవ్‌ ఆడుకునే వాడు. అతనికి తొమ్మిది సంవత్సరాలు నిండగానే క్రికెట్‌ కోచింగ్‌ కోసం తమ ఊరికి దగ్గర్లోని సమస్తిపూర్ పట్టణంలోని క్రికెట్ అకాడమీలో వైభవ్‌ను చేర్పాడు వాళ్ల నాన్న. తొమ్మిదేళ్ల కొడుకు క్రికెటర్‌గా ఎదుగుతాడనే నమ్మకంతో.. సంజీవ్‌ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. వైభవ్‌ క్రికెట్‌ కోచింగ్‌ కోసం తన పొలం అమ్మాలని నిర్ణయించుకున్నాడు.

కొడుకు కోసం పొలం అమ్మి..
ఆ పొలంపై తన కుటుంబం ఆధారపడి జీవిస్తుందనే విషయాన్ని కూడా పక్కనపెట్టి.. కొడుకు ఎదుగుదలనే నమ్మాడు. తన కొడుకు క్రికెట్ కలలను సాకారం చేసుకోవడానికి మోతీపూర్‌లోని తన పొలాన్ని అమ్మేశాడు. తండ్రి పొలం అమ్మిన విషయం తెలిసి వైభవ్‌ క్రికెట్‌ను ప్రాణం పెట్టి నేర్చుకున్నాడు. 

సమస్తిపూర్‌లో రెండున్నర సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం అండర్-16 ట్రయల్స్ ఇచ్చాడు వైభవ్‌. అదే సమయంలో మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా ఆధ్వర్యంలో వైభవ్‌కు మంచి క్వాలిటీ కోచింగ్‌ కూడా అందింది. ఆయన కోచింగ్‌ వైభవ్‌కు ఎంతో ప్లస్‌ అయింది. ఆ తర్వాతి చరిత్ర అందరికీ తెలిసిందే.

చదవండి: భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టుకు అవ‌మానం!

Advertisement
 
Advertisement
Advertisement