హాకీ ఇండియా అధ్యక్షుడిగా జ్ఞానేంద్రో

Gyanendro Ningomban elected as Hockey India president - Sakshi

న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌చ్‌ఐ) కొత్త అధ్యక్షుడిగా మణిపూర్‌కు చెందిన జ్ఞానేంద్రో నింగోంబం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన వీడియో సమావేశంలో ఆయనను ఎన్నుకుంటూ హెచ్‌ఐ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఈశాన్య రాష్ట్రాల నుంచి హెచ్‌ఐ అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా నింగోంబం నిలిచారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉండనున్నారు. ఆయన 2009–14 మధ్య మణిపూర్‌ హాకీ సీఈవోగా పనిచేయడం విశేషం.

2018లో అధ్యక్ష పదవిని చేపట్టిన మొహమ్మద్‌ ముస్తాక్‌ అహ్మద్‌ ఎన్నిక చెల్లదంటూ గతంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ క్రీడా నియమావళి ప్రకారం ఏ వ్యక్తి కూడా వరుసగా మూడు పర్యాయాలు ఆఫీస్‌ బేరర్‌గా ఉండరాదు. ముస్తాక్‌ అహ్మద్‌ 2010–14 మధ్య హెచ్‌ఐ కోశాధికారిగా, 2014–18 మధ్య సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు. 2018లో జాతీయ క్రీడా నియమావళి నిబంధనలను ఉల్లంఘిస్తూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాంతో ఆగ్రహించిన క్రీడా మంత్రిత్వ శాఖ... అహ్మద్‌ను వెంటనే పదవి నుంచి దిగిపోవాలని, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో అహ్మద్‌ను సీనియర్‌ ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకోవడం విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top