
ఆసియా కప్-2025 (Asia Cup) టీ20 టోర్నమెంట్లో తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మ్యాచ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav), మిస్టరీ స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి, ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాలను ఆడించింది.
ఇక యూఏఈతో మ్యాచ్‌లో కేవలం ఏడు పరుగులే ఇచ్చి కుల్దీప్ నాలుగు వికెట్లు కూల్చగా.. బుమ్రా, వరుణ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. అయితే ఆల్‌రౌండర్ల కోటాలో బరిలోకి దిగిన అక్షర్ పటేల్ ఒక వికెట్ తీయగా.. శివం దూబే (Shivam Dube) అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. రెండు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు.
ఇలాంటి జట్లపై ఎవరైనా ఆడతారు
ఈ నేపథ్యంలో శివం దూబే గురించి టీమిండియా మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ (Sadagopan Ramesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20లలో హార్దిక్ పాండ్యా భారత మూడో సీమర్‌గా సేవలు అందించేవాడు. అయితే, ఇప్పుడు శివం దూబే మూడో సీమర్‌గా ఉన్నాడు.
యూఏఈతో మ్యాచ్‌లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే, అలాంటి జట్టులపై ఎవరైనా రాణించగలరు. మున్ముందు కాస్త పటిష్ట జట్లను ఎదుర్కొంటున్నపుడు అతడికి కఠిన సవాలు ఎదురవుతుంది.

PC: BCCI
నమ్మకం నిలబెట్టుకుంటేనే
రింకూ సింగ్‌ను కాదని శివం దూబేను జట్టులోకి తీసుకోవడానికి కారణం.. అతడు మూడో సీమింగ్ ఆప్షన్‌గా అందుబాటులో ఉంటాడని మాత్రమే కదా!.. ఏదేమైనా శివం దూబేపై మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచుతున్న విషయం స్పష్టమవుతోంది. అతడు దానిని నిలబెట్టుకుంటేనే పరిస్థితులు మున్ముందు ఎలా ఉంటాయో తెలుస్తుంది’’ అని సదగోపన్ రమేశ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.
తొలి మ్యాచ్‌లో ఘన విజయం
కాగా యూఏఈ వేదికగా సెప్టెంబరు 9న ఆసియా కప్-2025 టోర్నీ ఆరంభమైంది. ఈ ఖండాంతర ఈవెంట్లో టీమిండియా.. పాకిస్తాన్, ఒమన్, యూఏఈతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది. ఈ క్రమంలో తమ తొలి మ్యాచ్‌లో యూఏఈతో ఆడిన టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి .. శుభారంభం అందుకుంది.
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్ యూఏఈని 57 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత కేవలం 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తదుపరి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో సెప్టెంబరు 14న టీమిండియా తలపడనుంది.
చదవండి: ఆకాశమే హద్దుగా చెలరేగిన అర్జున్ టెండుల్కర్.. సానియా చందోక్ రాకతో..