
PC: Instagram
భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) కుమారుడు అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar) గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవలే అతడి వివాహ నిశ్చితార్థం జరిగింది. ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలు సానియా చందోక్ (Saaniya Chandok)తో అర్జున్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం.
తొలి బంతికే వికెట్
అయితే, తాజాగా మరోసారి అర్జున్ టెండుల్కర్ పేరు వైరల్ అవుతోంది. అయితే, ఈసారి వ్యక్తిగత విషయాలతో కాకుండా.. ఆటతో ఈ ఆల్‌రౌండర్ వార్తల్లోకి వచ్చాడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) నిర్వహిస్తున్న డాక్టర్ కె. తిమ్మప్పయ్య మెమొరియల్ టోర్నమెంట్లో అర్జున్ టెండుల్కర్ తన దేశీ జట్టు గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఈ రెడ్‌బాల్ ఇన్విటేషనల్ టోర్నీలో భాగంగా గోవా తొలుత మహారాష్ట్రను ఎదుర్కొంది. ఈ క్రమంలో టాస్ ఓడి బౌలింగ్‌కు దిగిన గోవాకు అర్జున్ అదిరిపోయే ఆరంభం అందించాడు. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో తొలి బంతికే ఓపెనర్ అనిరుద్ సబాలేను అర్జున్ పెవిలియన్‌కు పంపాడు.
ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ మహేశ్ మాస్కే (1)ను కూడా అర్జున్ అవుట్ చేశాడు. ఇంతలో గోవాకు చెందిన మరో బౌలర్ లక్ష్మేశ్ పవానే యశ్ క్షీర్‌సాగర్ వికెట్ పడగొట్టగా..అర్జున్ మరోసారి స్ట్రైక్ అయ్యాడు.
దిగ్విజయ్ పాటిల్‌ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. మరోవైపు.. పవానే మహారాష్ట్ర కెప్టెన్ మందార్ భండారీని పెవిలియన్‌కు పంపగా.. మిజాన్ సయ్యద్ వికెట్‌ను మోహిత్ రేడ్కర్, షంసుజానా కాశీ వికెట్‌ను దర్శన్ మిశాల్ దక్కించుకున్నారు.
మొత్తంగా ఐదు వికెట్లు కూల్చిన అర్జున్
ఈ క్రమలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన మహారాష్ట్ర కోలుకోలేకపోయింది. ఎనిమిదో వికెట్‌కు 39 పరుగులు జోడించిన మెహుల్ పటేల్ (54)ను అర్జున్ టెండుల్కర్ అవుట్ చేయగా.. అక్షయ్ వైకార్‌ను వికాస్ సింగ్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత నదీమ్ షేక్ వికెట్‌ను కూడా అర్జున్ తన ఖాతాలో వేసుకున్నాడు.
మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో అర్జున్ 14-4-36-5 గణాంకాలు నమోదు చేశాడు. గోవా బౌలర్ల విజృంభణతో మహారాష్ట్ర 136 పరుగులకే కుప్పకూలగా.. గోవా తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. అభినవ్ తేజ్‌రాణా, కెప్టెన్ మిశాల్, రేడ్కార్ అర్ధ శతకాల కారణంగా గోవాకు ఈ స్కోరు సాధ్యమైంది.
అర్జున్ లేడీ లక్ సానియా అంటూ..
మరోవైపు బ్యాట్‌తోనూ రాణించిన పేస్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండుల్కర్ 36 పరుగులతో అజేయంగా నిలవడం విశేషం. ఇదిలా ఉంటే.. సానియాతో ఎంగేజ్‌మెంట్ తర్వాత అర్జున్ ఇలా అద్భుత రీతిలో రాణించడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘కాబోయే భార్య.. అర్జున్ లేడీ లక్’ అంటూ సానియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అర్జున్ ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్‌లో పునరాగమనం చేశాడు.
చదవండి: జీవనాధారం కోసం ఉద్యోగానికి ‘జై’... క్రికెట్‌కూ ‘సై’
Arjun Tendulkar Took Five Wicket in a Local Tournament after returning To The Cricket after 7 Month. pic.twitter.com/G7RWzxaGhI
— яιşнí. (@BellaDon_3z) September 10, 2025