
ఒమన్ ఆటగాళ్ల క్రికెట్ గాథ
తొలిసారి ఆసియా కప్ టి20 టోర్నీ బరిలోకి
సాక్షి క్రీడా విభాగం : మన దేశంలో క్రికెట్ ఓ మతమైంది. కోట్ల మంది జీవితాల్లో భాగమైంది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిల అంత స్థాయికి ఎదగలేకపోయినా సరే ఒక్కసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్టు దక్కితే చాలు... ‘గ్రేడ్’తో పని లేకుండా కోట్ల రూపాయల్లో వార్షిక పారితోషికం... పోటీలకు ఇంతని లక్షల్లో మ్యాచ్ ఫీజలు లభిస్తాయి. కాబట్టి ఆటగాడైతే చాలు... దేశవాళీ క్రికెట్‌తోనూ ఆటతోనే విలాసవంతంగా బ్రతికేస్తాడు.
అంతెందుకు ఒక్క ఐపీఎల్ సీజన్‌లో జూనియర్ స్థాయి ఆటగాడైన సరే అదృష్టం తలుపుతట్టి వేలంలో ఆయా జట్లకు ఎంపికైనా చాలు మిగతా జీవితమంతా సుఖమయం అవుతుంది. అయితే ఇదంతా భారత్‌లోనే చెల్లుతుంది. కానీ ఇతర దేశాల్లోని క్రికెటర్లు మైదానంలో చెమటోడ్చాలి. ఆఫీస్‌లో ఉద్యోగం చేయాలి.
చాలా దేశాల్లో ఇలానే...
క్రికెట్ ఆడే ఎన్నో దేశాల్లో ఇలాగే ఉంటుంది. కేవలం బ్యాట్ పట్టి నెట్స్‌లో ప్రాక్టీస్ చేసి, మ్యాచ్‌లపుడు మైదానంలో దిగితే సరిపోదు. జీవనాధారం కోసం ఉద్యోగం లేదంటే వ్యాపారం ఏదో ఒకటి తప్పనిసరిగా చేయాల్సిందే! తాజా ఆసియా కప్ టి20 టోర్నీలో బరిలో ఉన్న ఒమన్ క్రికెటర్లు కూడా ఇదే చేస్తారు. రూపాయి మారకం విలువ పరంగా ఒమని రియాల్ (ఒమన్ కరెన్సీ) మనకంటే చాలా విలువైందే అయినా... క్రికెట్‌లో మాత్రం బలహీనమైంది.
అక్కడి ప్రొఫెషనల్ క్రికెటర్లు సైతం తెల్లారితే లంచ్ బాక్స్‌లు కట్టుకొని ఆఫీస్‌కు వెళ్తారు. సాయంత్రమైతేనే ఆటకు సిద్ధమవుతారు. మ్యాచ్‌లు, పెద్ద పెద్ద సిరీస్‌లు ఉంటేనే పక్షం లేదంటే నెలకు మించి సెలవులు పెట్టి మెగా ఈవెంట్లు ఆడతారు. ఇది ముగియగానే ఒమన్ ఆటగాళ్లు మళ్లీ ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటారు. ఇవి ఎవరో ‘నెట్టింట’ పెట్టిన విషయాలో, ‘షార్ట్స్’, ‘రీల్స్’లో చెప్పిన కబుర్లో కాదు... స్వయంగా ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్, ఆల్‌రౌండర్ సుఫియాన్ మెహమూద్ వెల్లడించిన వాస్తవాలు.
ఉద్యోగానికే తొలి ప్రాధాన్యం
క్రికెటే తమ కెరీర్ కానేకాదని జతిందర్ స్పష్టం చేశాడు. తమ తొలి ప్రాధాన్యం ఉద్యోగమేనన్నాడు. ఆటను మొదలు పెట్టిన తొలినాళ్లలో మా ప్రాధాన్యమంతా ఉద్యోగానికే ఉండేదని, క్రికెట్ ఆట తమకు రెండో ప్రాధాన్యమని ఒమన్ కెపె్టన్ చెప్పాడు. ‘నేనే కాదు చాలామంది ఇదే చేస్తారు. ఠంచనుగా ఉద్యోగం చేసేందుకు బయల్దేరతారు. క్రికెట్‌ను ఓ ప్రత్యామ్నాయంగానే చూస్తారు. అయితే ఇప్పుడు ఆసియా కప్ లాంటి పేరొందిన సిరీస్ ఆడటం ద్వారా క్రికెట్ కల పెద్దగా అనిపిస్తుంది. తొలిసారి ఈ టోర్నీ ఆడేందుకు ఆటగాళ్లంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు’ అని జతిందర్ అన్నాడు.
కాంక్రిట్‌పై కష్టాలెన్నో...
ఒమన్‌లో క్రికెట్‌కు ప్రత్యేకించి టర్ఫ్ గ్రౌండ్లు అంటూ లేని రోజుల్లో తాము సిమెంట్ వికెట్‌లపైనే ఆడాల్సి వచ్చిందని, 2008లో ఆస్ట్రోటర్ఫ్ వినియోగంలోకి వచ్చినా... మూడేళ్ల తర్వాతే 2011 నుంచి పూర్తిస్థాయి టర్ఫ్ గ్రౌండ్‌పై క్రమం తప్పకుండా ఆడుతున్నామని జతిందర్ ఒమన్ క్రికెట్ కష్టాలను చెప్పుకొచ్చాడు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఫలితం (ప్రాభవం లేని క్రికెట్)లేని ఆట కోసం ఎందుకు కష్టపడాలని ఎన్నోసార్లు అనిపించినా... ఏదో క్రికెట్‌పై ఉన్న కాస్త మక్కువే ఇక్కడిదాకా తీసుకొచ్చిందని వివరించాడు.
36 ఏళ్ల జతిందర్ ఇప్పటి వరకు 36 వన్డేలాడి 1704 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలున్నాయి. అంతర్జాతీయ టి20ల్లో 115 స్ట్రయిక్‌రేట్‌తో 1120 పరుగులు సాధించాడు. మరోవైపు 34 ఏళ్ల ఆల్‌రౌండర్ సుఫియాన్ 8 వన్డేలాడి 107 పరుగులు చేయడంతో పాటు 24.50 సగటుతో 6 వికెట్లు కూడా తీశాడు. తనకు టీమిండియాలో గిల్, సూర్యకుమార్, అభిషేక్ శర్మ, అర్ష్ దీప్, తిలక్ వర్మ అంటే ఇష్టమని చెప్పాడు.
క్రికెటెందుకు... చదువుకో ముందు!
సుఫియాన్ ఒమన్ క్రికెట్ జట్టుకు ఎంపికవగానే అతని తల్లిదండ్రులు ససేమిరా అన్నారట! ఒమన్‌లో క్రికెట్‌కు భవిష్యత్తే లేదని, ఉన్నత చదువులు చదివి ఉన్నతోద్యోగంపైనే దృష్టి సారించాలని తన తల్లిదండ్రులు గట్టిగా చెప్పారని పేర్కొన్నాడు. ‘కానీ క్రికెట్ అంటే పిచ్చి. నాపై ఉన్న నమ్మకమే ఆటవైపు నడిపించింది. 2016 టి20 ప్రపంచకప్ అర్హత సాధించగానే మేం పడిన కష్టాలకు సాంత్వన చేకూరింది’ అని సుఫియాన్ తెలిపాడు. ఒమన్ క్రికెట్ నిలబడటానికి ఆ మెగా ఈవెంట్ ఎంతగానో దోహదం చేసిందన్నాడు. భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన
అభిమాన క్రికెటర్ అని చెప్పుకొచ్చాడు.