
బెంగళూరు: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ గ్రేస్ హారిస్... త్వరలో జరగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీకి దూరమైంది. పిక్క కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న గ్రేస్... ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్‌కప్‌నకు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. దీంతో ఆమె స్థానంలో సీనియర్ ఆల్‌రౌండర్ హీథర్ గ్రహమ్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి.
ఈ నెల 30 నుంచి భారత్, శ్రీలంక వేదికగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుండగా... ఆస్ట్రేలియా జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియాతో ఆడిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ ఆసీస్ గెలుపొందింది.
ఈ సిరీస్ సందర్భంగానే 28 ఏళ్ల హారిస్ గాయపడింది. శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆమె కాలుకు గాయమైంది. గ్రేస్ ఇప్పటి వరకు ఆ్రస్టేలియా జాతీయ జట్టు తరఫున ఒక వన్డే, ఐదు టి20లు ఆడి... తొమ్మిది వికెట్లు పడగొట్టింది.