ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ల వేధింపుల వ్యవహారంలో.. నిందితుడిని అరెస్ట్ చేసినప్పటికీ ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. ఈలోపు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ(Kailash Vijayvargiya) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఘటన ఆ ఇద్దరు మహిళా క్రికెటర్లకూ గుణం పాఠం లాంటిందంటూ వ్యాఖ్యానించారాయన.
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 టోర్నీ కోసం వచ్చిన ఆసీస్ టీంలో ఇద్దరు క్రికెటర్లు ఇండోర్ నగరంలో వేధింపులకు గురయ్యారు(Indore Incident). అక్టోబర్ 23వ తేదీన ఖజ్రానా రోడ్‌లో ఉన్న హోటల్ నుంచి దగ్గర్లోని ఓ కేఫ్‌కి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి బైక్ మీద వచ్చి వాళ్లిద్దరినీ తాకి పరాయ్యాడు. జట్టు నిర్వాహకుల ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడిని పట్టుకున్నారు. తాజాగా..
మంత్రి విజయ వర్గీయ ఈ ఘటనపై స్పందిస్తూ.. గతంలో ఓ ఇంగ్లీష్ ఫుట్‌బాల్ ఆటగాడికి తన సమక్షంలో ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన మీడియాకు వివరించారు. ‘‘ఇంగ్లీష్ ఫుట్‌బాలర్ ఒకరు నాతో పాటే ఓ హెటల్‌లో దిగారు. అతను దిగాడనే సమాచారం అందుకుని అభిమానులు అక్కడికి పోటెత్తారు. కొందరు అతని నుంచి ఆటోగ్రాఫులు తీసుకుంటుంటే.. ఓ అమ్మాయి అతనికి ముద్దు పెట్టింది. ఆ సయమంలో పెనుగులాట జరిగి.. అతని దుస్తులు చించేశారు. క్రీడాకారులు ఎప్పుడూ తమకు ఉన్న ప్రజాదరణను గుర్తుంచుకోవాలి. అలా పబ్లిక్ ప్లేస్‌లకు వెళ్లేటప్పుడు కచ్చితంగా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలి. లేకుంటే ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఈ ఘటన మనకు మాత్రమే కాదు.. వాళ్లిద్దరీకి కూడా ఓ గుణపాఠం’’ అని అన్నారాయన.
మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళల భద్రతను పక్కనపెట్టి బాధితులను తప్పుపడుతున్నట్లుగా ఉన్నాయని కాంగ్రెస్ నేత అరుణ్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. అతిథి దేవో భవ అనేది మర్చిపోయినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. విజయవర్గీయ వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. తాను కేవలం సెల్ఫీ కోసమే ప్రయత్నించానని, వేధించలేదని తొలుత నిందితుడు అకీల్(28) చెప్పాడు. అయితే విచారణలో ఉద్దేశపూర్వకంగానే వాళ్లను వెంబడించి వేధించాడని తేలడంతో నిజం ఒప్పుకున్నాడు. తన తండ్రిని డ్యూటీలో దించేసి వెళ్తుండగా ప్లేయర్స్‌ని చూసి బైక్ వాళ్ల వైపు తిప్పాడు. కొద్ది దూరం వెంబడించి వికృత చేష్టలకు పాల్పడి పారిపోయాడు.
మంత్రి విజయవర్గీయకు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. బహిరంగ ప్రదేశాల్లో రాహుల్ తన సోదరి పట్ల చూపే ఆప్యాయత భారతీయ సంస్కృతికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. అది విదేశాల నుంచి తెచ్చుకున్న విలువలని విమర్శించారు. ‘మేము పాత సంస్కృతికి చెందినవాళ్లం. మా సోదరీమణుల గ్రామంలో కనీసం నీళ్లు కూడా తాగము. మా అత్త నివసించే జిరాపూర్‌కు వెళ్లినప్పుడు నా తండ్రి కుండ నీరు తీసుకెళ్లేవారు. కానీ, నేడు మన ప్రతిపక్ష నాయకులు తమ సోదరీమణులను నడిరోడ్డుపైనే ముద్దుపెట్టుకుంటున్నారు. మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటున్నాను.. మీలో ఎవరైనా బహిరంగంగా మీ సోదరిని లేదా కూతురిని ముద్దుపెట్టుకుంటారా..? ఇది విలువలు లేకపోవడమే. ఇవన్నీ విదేశాల్లో పెరగడం వల్ల వచ్చిన విదేశీ విలువలు. వాళ్లు మన ప్రధాన మంత్రితో కూడా అమర్యాదగానే మాట్లాడతారు’ అని అన్నారు. కైలాశ్ విజయవర్గీయ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ఆయన తన కామెంట్లపై అస్సలు తగ్గలేదు.
ఇదీ చదవండి: ఇండోర్ ఘటన.. నిందితుడు మాములోడు కాదు!


