Kohli vs Gill: ఏడిపించిన కోహ్లి.. ఇచ్చిపడేసిన గిల్‌! | Gill Shows Virat Kohli RCB Place As Latter Continues Charging At Him | Sakshi
Sakshi News home page

Kohli vs Gill: ఏడిపించిన కోహ్లి.. ఇచ్చిపడేసిన గిల్‌!

May 1 2026 3:43 PM | Updated on May 1 2026 4:30 PM

Gill Shows Virat Kohli RCB Place As Latter Continues Charging At Him

PC: BCCI

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు గుజరాత్‌ టైటాన్స్‌ షాకిచ్చింది. గత వారం ఎదురైన పరాభవానికి సొంతగడ్డపై బదులు తీర్చుకుంది. ఐపీఎల్‌-2026లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా గురువారం గుజరాత్‌- ఆర్సీబీ తలపడ్డాయి.

కోహ్లి, గిల్‌ స్కోర్లు ఎంతంటే?
ఇందులో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులుకు ఆలౌటైంది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (24 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా, విరాట్‌ కోహ్లి (13 బంతుల్లో 28; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.

అనంతరం గుజరాత్‌ 15.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్‌ గిల్‌ (18 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), జోస్‌ బట్లర్‌ (19 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.  12 పరుగులు చేయడంతోపాటు, 2 వికెట్లు పడగొట్టి, 3 క్యాచ్‌లు పట్టిన జేసన్‌ హోల్డర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. 
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా ఆర్సీబీ దిగ్గజం, కింగ్‌ కోహ్లి- గుజరాత్‌ కెప్టెన్‌, ప్రిన్స్‌ గిల్‌ మధ్య చోటు చేసుకున్న సరదా సన్నివేశాలు వైరల్‌ అవుతున్నాయి. మ్యాచ్‌ సమయంలో గిల్‌ పట్ల పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. ఆ తర్వాత మాత్రం అతడిని టీజ్‌ చేశాడు. ఇందుకు గిల్‌ కూడా గట్టిగానే బదులిచ్చాడు.

ఏడిపించిన కోహ్లి.. 
భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో గిల్‌ ఇచ్చిన క్యాచ్‌ పట్టిన కోహ్లి.. అతడు పెవిలియన్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆసమయంలో కోహ్లి వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకోగా.. గిల్‌ నిరాశగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్‌ డగౌట్లో కూర్చోగా.. ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి.. అతడిని అవుట్‌ చేసిన విధానాన్ని సైగలతో చూపిస్తూ టీజ్‌ చేశాడు.

ఇచ్చిపడేసిన గిల్‌!
ఇందుకు గిల్‌.. ‘స్కోరు బోర్డు చూడు భయ్యా.. నేను అవుటైతే ఏంటి? గెలిచేది మేమే’ అన్నట్లుగా తానూ సైగలతోనే కౌంటర్‌ వేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ ఆర్సీబీపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత.. ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో గిల్‌- కోహ్లి ఆలింగనం చేసుకుని నవ్వులు చిందించారు.

అయితే, ఆ తర్వాత కూడా గిల్‌ కోహ్లి, ఆర్సీబీని వదిలిపెట్టలేదు. కోహ్లి, తానూ ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘జేసన్‌ హోల్డర్‌.. ప్లే హోల్డ్‌ బోల్డ్‌.. ఈరోజు రాత్రి అత్యద్భుతమైన ప్రదర్శన’ అంటూ ఆర్సీబీ, కోహ్లిని టార్గెట్‌ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ ఇచ్చిన క్యాచ్‌ను హోల్డర్‌ పట్టాడు.

అయితే, ఇది క్లీన్‌ క్యాచ్‌ కాదని కోహ్లి వాదించగా.. థర్డ్‌ అంపైర్‌ మాత్రం అవుట్‌గా ప్రకటించాడు. దీంతో వివాదం చెలరేగింది. అయితే, ఫలితం మాత్రం గుజరాత్‌కు మేలు చేసింది. మరోవైపు.. ఆర్సీబీ ప్లే బోల్డ్‌ అన్న నినాదంతో ముందుకు సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటినీ ప్రస్తావిస్తూ గిల్‌ ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు.

చదవండి: కింద పడేసి తొక్కుతా బిడ్డా!.. క్లాసెన్‌ మాస్‌ వార్నింగ్‌!

 

Advertisement
 
Advertisement
Advertisement