గుజరాత్ టైటాన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుపై ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్-2026లో భాగంగా గత శనివారం బెంగళూరు వేదికపై 205 పరుగులు చేసి కూడా గుజరాత్ టైటాన్స్ ఓటమిని ఎదుర్కొంది. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో సొంతగడ్డపై ‘రిటర్న్’ మ్యాచ్‌తో ఆర్సీబీని ఓడించింది. నాలుగు వికెట్ల తేడాతో పాటీదార్ సేనపై గెలుపొందింది.
రీప్లేలో స్పష్టంగా కనిపించింది
అయితే, ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా చోటుచేసుకున్న అనూహ్య ఘటన వివాదానికి దారితీసింది. అర్షద్ బౌలింగ్‌లో ఆర్సీబీ సారథి రజత్ పాటీదార్ (19) పుల్ షాట్ కొట్టగా... డీప్ స్క్వేర్‌లెగ్ నుంచి పరుగెత్తుతూ వచ్చిన జేసన్ హోల్డర్ (Jason Holder) ముందుకు దూకుతూ క్యాచ్ అందుకున్నాడు.
అయితే హోల్డర్ క్యాచ్ పట్టిన తర్వాత బంతి నేలకు తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. తన ఎడమ చేతిలో బంతిని ఉంచుకున్న హోల్డర్ తనను తాను నియంత్రించుకునే క్రమంలో బంతిపైనే పూర్తిగా భారం వేసి మరీ పైకి లేచాడు.
It’s heating up in Ahmedabad! 🔥#JasonHolder caught #RajatPatidar at the boundary, but the #RCB camp wasn’t convinced with the decision! 👀#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/GwfAoIelDj
— Star Sports (@StarSportsIndia) April 30, 2026
రిజర్వ్ అంపైర్‌తో కోహ్లి వాగ్వాదం
అయినప్పటికీ.. థర్డ్ అంపైర్ అభిజిత్ భట్టాచార్య మాత్రం బంతిని హోల్డర్ సరిగానే పట్టుకున్నాడని, బంతిని పూర్తి నియంత్రణలో ఉంచుకున్నాడని భావిస్తూ అవుట్‌గా ప్రకటించాడు. దీంతో ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లి, కోచ్ ఆండీ ఫ్లవర్ రిజర్వ్ అంపైర్ పరాశర్ జోషితో గట్టిగా వాదించినా ఫలితం లేకుండా పోయింది.
ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. పాటీదార్ అవుట్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని అతడు తప్పుబట్టాడు. ‘‘నా దృష్టిలో హోల్డర్ పట్టింది అసలు క్యాచ్ కానేకాదు. క్రికెట్ చట్టంలోని 33.3 నియమం ప్రకారం..
అంపైర్‌ది ముమ్మాటికీ తప్పే!
బంతి ఒక్కసారి చేతిలోకి వచ్చినపుడు బాల్‌తో పాటు శరీరంపై కూడా ఆటగాడు పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. అప్పటి వరకు బంతి నేలను అస్సలు తాకకూడదు. ఆ సమయంలో ఆటగాడి చేయి నేలకు తాకినా సరే.. బంతి మాత్రం అస్సలు నేలకు తాకకూడదు.
జేసన్ హోల్డర్ క్యాచ్ పట్టిన వెంటనే జారిపడ్డాడు. స్లైడ్ అవుతున్న సమయంలో అతడి శరీరం చలనంలో ఉంది కాబట్టి అతడు తనను తాను పూర్తిగా నియంత్రించుకోలేకోయాడు. అప్పుడే బంతి నేలకు తాకింది. అప్పటికి అది ఇంకా డెడ్‌బాల్ కానేలేదు.
కాబట్టి ఆ క్యాచ్ పూర్తికానట్లే లెక్క. నా అభిప్రాయం ప్రకారం అంపైర్ తప్పుచేశాడు. బ్యాటర్(పాటీదార్)ను నాటౌట్‌గా ప్రకటించాల్సింది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
రూల్ ఇదే
కాగా మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ నియమం 33.2.2.1 ప్రకారం.. ఫీల్డర్ బంతిని అందుకున్నప్పుడు, అతడి చేతి వేళ్ల మధ్య నుంచి బాల్ నేలకు తాకినట్లయితే దాన్ని అవుట్‌గానే పరిగణిస్తారు. ఈ నియమాన్ని అనుసరించే థర్డ్ అంపైర్ పాటీదార్‌ను అవుట్‌గా ప్రకటించినట్లు తెలుస్తోంది.
చదవండి: అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్


