ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా యువ ఆటగాడు హర్షిత్ రాణా ఇరగదీస్తున్నాడు. విమర్శకులకు తన అద్భుత ప్రదర్శనలతోనే సమాధానిమిస్తున్నాడు. సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో హర్షిత్ సత్తాచాటాడు. 23 ఏళ్ల రాణా తన పేస్ బౌలింగ్‌తో కంగారులను కంగారెత్తించాడు.
అతడి బౌలింగ్ దాటికి ఆసీస్ కేవలం 236 పరుగులకే పరిమితమైంది. మొత్తంగా 8.4 ఓవర్లు బౌలింగ్ చేసిన రాణా.. 39 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ వంటి కీలక వికెట్లను ఈ ఢిల్లీ పేసర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో రాణాకు ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం గమనార్హం.
ఆసీస్ టూర్‌కు రాణాను ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పుబట్టారు. గంభీర్ సపోర్ట్ వల్లే అతడిని జట్టులోకి తీసుకున్నారని అశ్విన్, కృష్ణమాచారి శ్రీకాంత్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం విమర్శించారు. అయితే విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. పూర్తిగా మెరిట్ ఆధారంగానే రాణాను సెలక్ట్ చేశామని, అతడిని టార్గెట్ చేయడం అపండి అంటూ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ పేర్కొన్నాడు.
అయితే గంభీర్ నమ్మకాన్ని రాణా నిలబెట్టుకున్నాడు. తొలి వన్డేలో వికెట్ పడగొట్టనప్పటికి.. రెండో వన్డేలో 24 పరుగులతో పాటు 2 వికెట్లు సాధించాడు. ఇక మూడో వన్డేలో కూడా అర్ష్‌దీప్ సింగ్‌ను కాదని మరి హర్షిత్‌ను టీమ్ మెనెజ్‌మెంట్ ఆడించింది. మెనెజ్‌మెంట్ నమ్మకాన్ని రాణా వమ్ము చేయలేదు. నాలుగు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఇదే తరహా ప్రదర్శనలు కనబరిస్తే అతడు వన్డే జట్టులో తన స్దానాన్ని మరింత పదిలం చేసుకోవడం ఖాయం.
చదవండి: సింగిల్ తీసిన కోహ్లి.. దద్దరిల్లిన స్టేడియం.. వీడియో వైరల్


