Gautam Gambhir: సోషల్‌ మీడియా యూజర్లను పెంచుకోవడానికేనా ఇలా?!

Gautam Gambhir Backs Ravi Ashwin He Has Done Nothing Wrong - Sakshi

Gautam Gambhir Comments On Ashwin- Morgan Row: ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి క్రీడా వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. కొంతమంది మోర్గాన్‌కు మద్దతు పలుకుతుండగా.. మరికొందరు అశ్విన్‌కు అండగా నిలుస్తున్నారు. ఇక ఈ వివాదంపై టీమిండియా మాజీ క్రికెటర్‌, కేకేఆర్‌ మాజీ కెప్టెన్‌ గౌతం గంభీర్‌ తనదైన శైలిలో స్పందించాడు. ఈ ఘటనలో అశ్విన్‌కు వంద శాతం తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశాడు. నిబంధనలకు లోబడే అశ్విన్‌ అలా ప్రవర్తించాడని, అందులో ఎలాంటి తప్పు లేదని పేర్కొన్నాడు.

ఈ మేరకు ఒకప్పటి ఢిల్లీ జట్టు సారథి గౌతీ స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఈ విషయం గురించి అనవసరంగా మాట్లాడుతున్నారు. వాళ్లకు ఇందులో అసలు ప్రమేయం ఎందుకు? బహుశా సోషల్‌ మీడియా యూజర్లను పెంచుకునే క్రమంలో ఇలా మాట్లాడుతున్నారేమోనని అనిపిస్తోంది. ఇలా చేయడంలో ఏమాత్రం అర్థం లేదు. అశ్విన్‌ కచ్చితంగా సరైన పనే చేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని అశూకు మద్దతు తెలిపాడు. కాగా ఆసీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ అశ్విన్‌దే తప్పంటూ వ్యాఖ్యానించిన విషయం విదితమే.


courtesy: IPL

ఇక సెప్టెంబరు 28న కేకేఆర్‌తో ఢిల్లీ మ్యాచ్‌ సందర్భంగా సౌథీ, అశ్విన్‌ల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో కేకేఆర్‌ కెప్టెన్‌ మోర్గాన్‌.. సౌథీకి అండగా నిలిచాడు. దీంతో అశ్విన్‌ సీరియస్‌ అయ్యాడు. ఈ క్రమంలో కేకేఆర్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ జోక్యం చేసుకుని గొడవను ఆపాడు. అయితే, ఆ తర్వాత దినేశ్‌ కార్తిక్‌ మాట్లాడుతూ..  బాల్‌ పంత్‌ను తాకిన తర్వాత కూడా అశ్విన్‌ పరుగు తీయడం క్రీడా స్ఫూర్తికి విరుద్దమనే ఉద్దేశంలో మోర్గాన్‌ అలా స్పందించి ఉంటాడని పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన అశ్విన్‌.. నిబంధనలకు లోబడే పరుగు తీశానని, ఇందులో తన తప్పేమీ లేదని కౌంటర్‌ ఇచ్చాడు. 

చదవండి: MS Dhoni: చాలు సామీ.. చాలు.. ఫినిషర్‌ ఇంకా బతికే ఉన్నాడు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top