
కామెంటేటర్ ఉద్యోగం కోల్పోయిన మాజీ ఫుట్‌బాలర్ గ్యారీ లినేకర్
లండన్: ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు, కామెంటేటర్ గ్యారీ లినేకర్ (Gary Lineker) బీబీసీ వ్యాఖ్యాత స్థానం నుంచి వైదొలగనున్నాడు. సామాజిక మాధ్యమాల్లో జియోనిజానికి సంబంధించిన పోస్ట్ పెట్టిన కారణంగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న గ్యారీ... ఇప్పుడు వ్యాఖ్యాతగా తప్పుకోనున్నాడు. మీడియా సెలబ్రిటీగా మంచి పేరున్న 64 ఏళ్ల లినేకర్... అత్యధిక పారితోషికం అందుకుంటున్న బ్రిటిష్ జాతీయ ప్రసారకుడిగా ఉన్నాడు. బీబీసీలో వ్యాఖ్యాతగా అతడు ఏడాదికి దాదాపు 1.7 మిలియన్ల అమెరికా డాలర్లు (రూ. 14 కోట్ల 52 లక్షలు) ప్రతిఫలంగా పొందుతున్నాడు.
‘జియోనిజం రెండు నిమిషాల్లో వివరించొచ్చు’ అనే క్యాప్షన్‌తో కూడిన ఎలుక చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో లినేకర్‌పై విమర్శలు గుప్పుమన్నాయి. యూదు వ్యతిరేక భావజాలం కలిగిన ఇలాంటి పోస్టు పెట్టినందుకు లినేకర్ ఇప్పటికే బహిరంగ క్షమాపణలు చెప్పినప్పటికీ... బీబీసీ గౌరవ మర్యాదలకు భంగం కలిగించినందుకు సోషల్ మీడియా పాలసీ (Social Media Policy) ప్రకారం అతడిపై యాజమాన్యం చర్యలు తీసుకుంది.
ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 80 మ్యాచ్‌లాడిన లినేకర్... 48 గోల్స్ చేశాడు. 1986 ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
చదవండి: భారత టాప్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై గగన్ నారంగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్