నాదల్‌ను ఆపతరమా?

Frech Open 2021: Rafael Nadal Nadal Ready To Fight As Title Favorite - Sakshi

 నేటి నుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌

కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి స్పెయిన్‌ స్టార్‌

జొకోవిచ్, థీమ్, సిట్సిపాస్‌ నుంచి పోటీ

మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–2లో ప్రత్యక్ష ప్రసారం

పారిస్‌: పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అడుగుపెడుతున్నాడు. ఆదివారం మొదలయ్యే ఈ టోర్నీలో నాదల్‌ మరోసారి టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే 13 సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచిన 34 ఏళ్ల నాదల్‌... ఓవరాల్‌గా 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ సరసన సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఈసారి నాదల్‌ పార్శ్వంలోనే వరల్డ్‌ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ (సెర్బియా), మాజీ చాంపియన్‌ ఫెడరర్‌ కూడా ఉండటంతో నాదల్‌ ఖాతాలో ట్రోఫీ చేరాలంటే అతను విశేషంగా రాణించాల్సి ఉంటుంది. 

మరో పార్శ్వంలో రెండుసార్లు రన్నరప్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆ్రస్టియా)తోపాటు ఐదో ర్యాంకర్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌), ఆరో ర్యాంకర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), రెండో ర్యాంకర్‌ మెద్వెదేవ్‌ (రష్యా) ఉన్నారు. అయితే క్లే కోర్టులపై మెద్వెదేవ్‌కు అంత గొప్ప రికార్డులేదు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పాల్గొన్న నాలుగుసార్లు మెద్వెదేవ్‌ తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. నాదల్, జొకోవిచ్‌లతోపాటు థీమ్, సిట్సిపాస్‌లు కూడా టైటిల్‌ రేసులో ఉన్నారు. తొలి రౌండ్‌లో 62వ ర్యాంకర్‌ పాపిరిన్‌ (ఆ్రస్టేలియా)తో నాదల్‌... ఇస్తోమిన్‌ (ఉజ్బెకిస్తాన్‌)తో ఫెడరర్‌... సాండ్‌గ్రెన్‌ (అమెరికా) తో జొకోవిచ్‌ ఆడతారు. 

మరోవైపు మహిళల విభాగంలో తీవ్రమైన పోటీదృష్ట్యా కచి్చతమైన ఫేవరెట్‌ కనిపించడంలేదు. డిఫెండింగ్‌ చాంపియన్‌ స్వియాటెక్‌ (పోలాండ్‌)తోపాటు వరల్డ్‌ నంబర్‌వన్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), రెండో సీడ్‌ నయోమి ఒసాకా (జపాన్‌), ఐదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), మాజీ చాంపియన్స్‌ ముగురుజా (స్పెయిన్‌), సెరెనా విలియమ్స్‌ (అమెరికా) టైటిల్‌ రేసులో ఉన్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top