Lionel Messi: ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా! అయినా.. మెస్సీ అభిమానులకు తప్పని నిరాశ!

FIFA WC: Argentina Beat Poland But Messi Misses Penalty Check Records - Sakshi

FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్‌కప్‌-2022 టోర్నీలో అర్జెంటీనా ముందడుగు వేసింది. మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు పోలాండ్‌ను 2-0తో మట్టికరిపించింది. గ్రూప్‌- సీ టాపర్‌గా నాకౌట్‌ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో రౌండ్‌ ఆఫ్‌ 16లో భాగంగా అర్జెంటీనా తమ తదుపరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో పోటీపడనుంది.

ఆ రెండు గోల్స్‌
దోహా వేదికగా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన మ్యాచ్‌లో గ్రూప్‌-సీలో భాగమైన అర్జెంటీనా- పోలాండ్‌ తలపడ్డాయి. ఈ క్రమంలో తొలి అర్ధభాగం గోల్‌ లేకుండానే ముగిసింది. అయితే, సెకండాఫ్‌లో అలెక్సిస్‌ మాక్‌ అలిస్టర్‌, జూలియన్‌ అల్వరెజ్‌ గోల్స్‌ సాధించడంతో మెస్సీ బృందం విజయం ఖరారైంది.  ఇదిలా ఉంటే గ్రూప్‌-సీలోని మరో మ్యాచ్‌లో మెక్సికో సౌదీ అరేబియాను 2-1తో ఓడించింది. 

ఈ నేపథ్యంలో గెలిచిన ఆరు పాయింట్లతో అర్జెంటీనా గ్రూప్‌- సీ టాపర్‌గా నాకౌట్‌కు చేరగా.. రెండో స్థానంలో ఉన్న పోలాండ్‌ ఓడినప్పటికీ ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. తదుపరి మ్యాచ్‌లో అర్జెంటీనా- ఆస్ట్రేలియాను, పోలాండ్‌- డిపెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ను ఎదుర్కోనున్నాయి.

రికార్డు బద్దలు కొట్టినా..
స్టార్‌ ఫుట్‌బాలర్‌గా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లియోనల్‌ మెస్సీకి ఇది 999వ మ్యాచ్‌. అంతేకాదు.. ఫిఫా వరల్డ్‌కప్‌ టోర్నీలో 22వది. ఈ క్రమంలో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా ఉన్న పేరిట రికార్డును మెస్సీ బద్దలు కొట్టాడు. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అర్జెంటీనా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు.

ఆ ఒక్క లోటు మాత్రం..
ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లో మెస్సీ ఇప్పటి వరకు ఎనిమిది గోల్స్‌ చేశాడు. ఫిఫా వరల్డ్‌కప్‌-2022లో సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో గోల్‌ కొట్టిన మెస్సీ.. మెక్సికోతో మ్యాచ్‌లో అద్భుతమైన గోల్‌తో మెరిశాడు.

అయితే, తాజా మ్యాచ్‌లో మాత్రం అతడు గోల్‌ సాధించలేకపోయాడు. పోలాండ్‌తో మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీని గోల్‌గా మలచలేకపోయాడు. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే, మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా నాకౌట్‌కు చేరుకోవడంతో ఈ లోటు తీరినట్లయింది.

చదవండి: Ind Vs NZ: 12 బంతుల తేడాతో టీమిండియాకు తప్పిన పరాజయం! ఎలాగంటే..
FIFA WC 2022: అమెరికా ఆరోసారి.. ఆస్ట్రేలియా 2006 తర్వాత ఇదే తొలిసారి!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top