
భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా ఇవాల్టి నుంచి (జులై 23) నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును రెండు రోజుల ముందే ప్రకటించగా.. భారత్ గతంలో మాదిరే ఆఖరి నిమిషంలో ప్లేయింగ్ ఎలెవెన్‌ను అనౌన్స్ చేసింది.
ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తప్పనిసరి పరిస్థితిలో ఓ మార్పు చేయగా.. భారత్ ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది. మూడో టెస్ట్ సందర్భంగా గాయపడిన షోయబ్ బషీర్ స్థానంలో ఇంగ్లండ్ లియామ్ డాసన్‌ను బరిలోకి దించగా.. భారత్ కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్‌దీప్ స్థానాల్లో సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ తుది జట్టులోకి తీసుకుంది.
భారత్ చేసిన ఈ మూడు మార్పుల్లో రెండు సహేతుకమైనవే కాగా.. ఓ మార్పును మాత్రం టీమిండియా అభిమానులు స్వాగతించలేకపోతున్నారు. ఫామ్‌లో లేని కరుణ్ నాయర్‌కు బదులుగా సాయి సుదర్శన్.. గాయపడిన ఆకాశ్‌దీప్‌కు బదులుగా అన్షుల్ కంబోజ్ ఎంపికను సమర్దిస్తున్న ఫ్యాన్స్.. నితీశ్ కుమార్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా శార్దూల్ ఠాకూర్ ఎంపికను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో అసలు శార్దూల్ అవసరమేముందని ప్రశ్నిస్తున్నారు. అవసరమనుకుంటే బౌలర్‌ను.. లేదనుకుంటే బ్యాటర్‌ను తీసుకోవాలి కాని.. అటు బౌలింగ్‌కు, ఇటు బ్యాటింగ్‌కు పూర్తిగా న్యాయం చేయలేని శార్దూల్ ఎంపిక దండగ అని మండిపడుతున్నారు.
ఏ ఆప్షన్ లేక శార్దూల్ ఠాకూర్‌ను ఎంపిక చేయడం పరిపాటిగా మారిందని దుయ్యబడుతున్నారు. ఆల్‌రౌండర్ అన్న ట్యాగ్ ఉంది కాబట్టి ప్రతిసారి శార్దూల్ ఠాకూర్‌ను ఎంపిక చేయడం సరికాదని అంటున్నారు.
వాస్తవానికి శార్దూల్ విషయంలో అభిమానుల ఆగ్రహానికి కారణాలు లేకపోలేదు. ఈ సిరీస్‌లోనే కాకుండా గతంలో చాలా సార్లు అతన్ని ఆల్‌రౌండర్ కోటాలో జట్టులోకి తీసుకొని ఏ విభాగంలోనూ పూర్తిగా వినియోగించుకోలేదు. శార్దూల్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసి ప్రతిసారి ఓ స్థానాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తారు.
ఇదే అభిమానులకు చిరాకు తెప్పిస్తుంది. ఎవరిని ఎంపిక చేయాలో తెలియక ఎవరో ఒకరు అన్న ధోరణిలో శార్దూల్‌ను ఎంపిక చేయడాన్ని ఫ్యాన్స్ తీవ్రమైన తప్పిదంగా పరిగణిస్తున్నారు. మరి ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఏం చేస్తాడో చూడాలి మరి.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 18 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 32, యశస్వి జైస్వాల్ 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
తుది జట్లు..
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.
భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.