
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన నాటి నుంచి చర్చనీయాంశమైన పేరు హర్షిత్ రాణా (Harshit Rana). హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రియ శిష్యుడైన కారణంగానే అతడికి జట్టులో చోటు దక్కిందనే విమర్శలు వచ్చాయి. భారత మాజీ క్రికెటర్లు క్రిష్ణమాచారి శ్రీకాంత్, రవిచంద్రన్ అశ్విన్ ప్రధానంగా ఈ విషయంపై వీడియోలు చేశారు.
27 పరుగులు ఇచ్చి
అయితే, గంభీర్ కూడా వారికి అదే రీతిలో బదులిచ్చాడు. యూట్యూబ్ చానెళ్ల వ్యూస్ కోసం 23 ఏళ్ల కుర్రాడి భవిష్యత్తు నాశనం చేస్తారా? అంటూ మండిపడ్డాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో తొలి వన్డే (IND vs AUS 1st ODI) తుదిజట్టులోనూ హర్షిత్ రాణాకు స్థానం దక్కింది. ఈ రైటార్మ్ యువ పేసర్ కేవలం నాలుగు ఓవర్ల బౌలింగ్‌లోనే 27 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎనిమిదో స్థానంలో వచ్చి రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు హర్షిత్ రాణా. ఈ నేపథ్యంలో భారత-‘ఎ’ జట్టు మాజీ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ హర్షిత్‌కు మేనేజ్‌మెంట్ ప్రాధాన్యం ఇవ్వడాన్ని విమర్శించాడు.
అతడిని ఎక్స్‌పోజ్ చేయండి.. దాచి పెడతారెందుకు?
ఈ మేరకు.. ‘‘ఒకవేళ హర్షిత్ రాణాను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయడానికే జట్టులోకి తీసుకుంటే.. అతడిని తనను తాను నిరూపించుకునే అవకాశం ఇవ్వండి. ఎక్స్‌పోజ్ చేయండి. రెండేళ్ల పాటు ఆ పాత్రలో తనను కొనసాగించండి.అంతేగానీ.. అదనపు బ్యాటర్‌ను జట్టులోకి తీసుకుని హర్షిత్‌ను కాపాడటం ఎందుకు?
జస్సీ లేనపుడు..
ఆల్‌రౌండర్లు నితీశ్ రెడ్డి లేదంటే వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాల్సింది. జస్సీ (జస్‌ప్రీత్ బుమ్రా) గైర్హాజరీలో.. అతడు లేని లోటు పూడుస్తూ కుల్దీప్ వికెట్లు తీసేవాడు కదా!’’ అని ప్రియాంక్ పాంచల్ సోషల్ మీడియా వేదికగా మేనేజ్‌మెంట్ తీరుపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా పంచుకున్నాడు.
ఓటమితో మొదలు
కాగా పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో గిల్ సేన తొమ్మిది వికెట్ల నష్టానికి 136 పరుగులే చేసింది. డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం ఆసీస్ తమ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 21.1 ఓవర్లలో 131 పరుగులు చేసి జయభేరి మోగించింది.
చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్