
మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (అక్టోబర్ 20) రెండో టీ20 జరిగింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో (New Zealand vs England) పర్యాటక జట్టు 65 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది.
తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా ఫలితం రాలేదు. మూడో టీ20 ఆక్లాండ్ వేదికగా అక్టోబర్ 23న జరుగనుంది. అనంతరం 26, 29, నవంబర్ 1 తేదీల్లో మౌంట్ మౌంగనూయ్, హ్యామిల్టన్, వెల్లింగ్టన్ వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి.
సాల్ట్, బ్రూక్ విధ్వంసం
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (Phil Salt) (56 బంతుల్లో 85; 11 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) (35 బంతుల్లో 78; 5 సిక్సర్లు, 6 ఫోర్లు) విధ్వంసం సృష్టించారు.
జేకబ్ బేతెల్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ బాంటన్ (12 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జోస్ బట్లర్ (4) ఒక్కడే నిరుత్సాహపరిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ 2, డఫీ, బ్రేస్‌వెల్‌కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేసిన స్కోర్ టీ20ల్లో న్యూజిలాండ్‌పై రెండో అత్యధికం.
రషీద్ మాయాజాలం
237 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. ఒక్క బ్యాటర్ కూడా భారీ స్కోర్ చేయలేకపోయారు. ఓటమి ఖరారయ్యాక కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (36) బ్యాట్ ఝులిపించాడు. టిమ్ సీఫర్ట్ (39), చాప్‌మన్ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
ఆదిల్ రషీద్ (Adil Rashid) (4-0-32-4) తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. అతనికి లూక్ వుడ్ (4-0-36-2), బ్రైడన్ కార్స్ (3-0-27-2), లియామ్ డాసన్ (4-0-38-2) సహకరించారు. వీరి ధాటికి న్యూజిలాండ్ 18 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 10 మంది ఆటగాళ్లు క్యాచ్ ఔట్‌ల రూపంలో ఔటయ్యారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇలా జరగడం కేవలం 13వ సారి మాత్రమే.
చదవండి: ఆల్ ఫార్మాట్ గ్రేట్‌గా ఎదుగుతాడు: నితీశ్ రెడ్డిపై రోహిత్ శర్మ ప్రశంసలు