మూడో టెస్టులో టీమిండియా పరాభవం

England beat India by an innings and 76 runs to level 5-match series 1-1 - Sakshi

నాలుగో రోజు తొలి సెషన్‌లోనే ఆలౌట్‌

63 పరుగుల తేడాలో 8 వికెట్లు కోల్పోయిన టీమిండియా

ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ ఘనవిజయం

ఐదు వికెట్లతో చెలరేగిన రాబిన్సన్‌  

లీడ్స్‌: ప్రత్యర్థి పేస్‌ ముందు ఎదురునిలువలేకపోయిన కోహ్లి బృందం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. గత రెండు టెస్టులకు ఏమాత్రం సరిపోని ప్రదర్శనతో టీమిండియా బోల్తా పడింది. ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్‌ ఐదు టెస్టుల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. సెప్టెంబర్‌ 2 నుంచి ఓవల్‌లో నాలుగో టెస్టు జరుగుతుంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 215/2తో నాలుగో రోజు శనివారం ఆట కొనసాగించిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 99.3 ఓవర్లలో 278 పరుగుల వద్ద ఆలౌటైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాబిన్సన్‌ (5/65), ఓవర్టన్‌ (3/47) భారత్‌ ఇన్నింగ్స్‌ను కూల్చేశారు. చేతిలో 8 వికెట్లున్న భారత్‌ నాలుగో రోజు ఉదయం సెషన్‌లో ఇరవై ఓవర్లయినా పూర్తిగా ఆడలేకపోయింది. ఓవర్‌నైట్‌ స్కోరుకు కేవలం 63 పరుగులు జతచేసి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయింది.  

చదవండి: Innings Defeat: మూడేళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ చేతిలోనే.. అప్పుడు, ఇప్పుడు అండర్సనే

ఇలా మొదలైంది... పతనం!
కచ్చితంగా సెంచరీ చేస్తాడనుకున్న పుజారా (189 బంతుల్లో 91;15 ఫోర్లు) ఆరంభంలోనే అవుటవ్వడంతో భారత్‌ పతనం మొదలైంది. రాబిన్సన్‌ బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన పుజారా వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలుత అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా... రూట్‌ రివ్యూకెళ్లి వికెట్‌ సాధించాడు. క్రితం రోజు స్కోరు వద్ద టీమిండియా ఈ కీలకమైన వికెట్‌ను కోల్పోయింది. ఇదే పెద్ద దెబ్బనుకుంటే... ఇక్కడితోనే ఖేల్‌ఖతమయ్యే దెబ్బలు పడ్డాయి.

237 స్కోరు వద్ద కోహ్లి (125 బంతుల్లో 55; 8 ఫోర్లు), మరో రెండు పరుగులు జత కాగానే రహానే (25 బంతుల్లో 10; 2 ఫోర్లు)... ఆ వెంటే రిషభ్‌ పంత్‌ (7 బంతుల్లో 1) రెండు పరుగుల వ్యవధిలో ముగ్గురు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ఔటయ్యారు. మిగిలిన వారిలో జడేజా ఉన్నా, వెనుకంజలో ఉన్న స్కోరును... ముందుకు తీసుకెళ్లె ఇంకో బ్యాట్స్‌మన్‌ అయితే లేడు. షమీ (6), బుమ్రా (1 నాటౌట్‌) లార్డ్స్‌లో ఒక సెషన్‌ ఆడారేమో కానీ... ఇక్కడ పునరావృతం చేయలేకపోయారు. దాంతో ఇంగ్లండ్‌ పేస్‌ బుల్లెట్లకు భారత్‌ వికెట్లను సమర్పించుకోవడం తప్ప చేయ గలిగిందేమీ లేకపోయింది. జడేజా (25 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుతో జట్టు స్కోరు 278 పరుగుల దాకా వెళ్లింది.

చదవండి: Viral Video: ఆండర్సన్‌ బౌలింగ్ చేస్తుంటే పంత్ ఏం చేస్తున్నాడో చూడండి..

ENG Vs IND: మళ్లీ వచ్చేశాడు.. ప్యాడ్స్‌ కట్టుకొని కోహ్లి స్థానంలో

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 78; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 432;
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) రాబిన్సన్‌ 59; రాహుల్‌ (సి) బెయిర్‌స్టో (బి) ఓవర్టన్‌ 8; పుజారా (ఎల్బీడబ్ల్యూ) (బి) రాబిన్సన్‌ 91; కోహ్లి (సి) రూట్‌ (బి) రాబిన్సన్‌ 55; రహానే (సి) బట్లర్‌ (బి) అండర్సన్‌ 10; పంత్‌ (సి) ఓవర్టన్‌ (బి) రాబిన్సన్‌ 1; జడేజా (సి) బట్లర్‌ (బి) ఓవర్టన్‌ 30; షమీ (బి) మొయిన్‌ అలీ 6; ఇషాంత్‌ (సి) బట్లర్‌ (బి) రాబిన్సన్‌ 2; బుమ్రా (నాటౌట్‌) 1; సిరాజ్‌ (సి) బెయిర్‌స్టో (బి) ఓవర్టన్‌ 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (99.3 ఓవర్లలో ఆలౌట్‌) 278. 
వికెట్ల పతనం: 1–34, 2–116, 3–215, 4–237, 5–239, 6–239, 7–254, 8–257, 9–278, 10–278.
బౌలింగ్‌: అండర్సన్‌ 26–11–63–1, రాబిన్సన్‌ 26–6–65–5, ఓవర్టన్‌ 18.3–6–47–3, స్యామ్‌ కరన్‌ 9–1–40–0, మొయిన్‌ అలీ 14–1–40–1, రూట్‌ 6–1–15–0.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top