38వ సెంచరీ పూర్తి చేసిన రూట్‌.. రికార్డుల జాతర | ENG VS IND 4th Test: Joe Root Completed 38th Century | Sakshi
Sakshi News home page

ENG VS IND 4th Test: 38వ సెంచరీ పూర్తి చేసిన రూట్‌.. రికార్డుల జాతర

Jul 25 2025 7:39 PM | Updated on Jul 25 2025 8:40 PM

ENG VS IND 4th Test: Joe Root Completed 38th Century

మాంచెస్టర్‌ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే రెండు భారీ రికార్డులు సాధించిన రూట్‌.. తాజాగా సెంచరీ పూర్తి చేసి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. 178 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన రూట్‌.. టెస్ట్‌ల్లో 38వ శతకాన్ని, ఓవరాల్‌గా (మూడు ఫార్మాట్లలో కలిపి) 56 శతకాన్ని నమోదు చేశాడు. 

ఈ సెంచరీతో రూట్‌ టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. సంగక్కర్‌ కూడా టెస్ట్‌ల్లో 38 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ (51), జాక్‌ కల్లిస్‌ (45), రికీ పాంటింగ్‌ (41) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

ఈ ఇన్నింగ్స్‌లో రూట్‌ తొలుత టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్‌ ద్రవిడ్‌ (13288), జాక్‌ కల్లిస్‌ను (13289) అధిగమించి మూడో స్థానానికి ఎగబాకాడు. ఆతర్వాత హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి టెస్ట్‌ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్‌, జాక్‌ కల్లిస్‌ను దాటేసి రెండో స్థానానికి చేరాడు. 

తాజాగా సెంచరీ పూర్తి చేసి టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంగక్కరతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సింగిల్‌గా ఆరో స్థానంలో నిలిచాడు. ఈ సెంచరీకి ముందు రూట్‌, హాషిమ్‌ అమ్లా తలో 55 సెంచరీలతో సంయుక్తంగా ఆరో స్థానంలో ఉండేవారు. 56వ సెంచరీతో రూట్‌ సింగిల్‌గా ఆరో స్థానానికి చేరాడు.

టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-5 బ్యాటర్లు..
సచిన్‌ టెండూల్కర్‌- 15921
రికీ పాంటింగ్‌- 13378
జో రూట్‌- 13358*
జాక్‌ కల్లిస్‌- 13289
రాహుల్‌ ద్రవిడ్‌- 13288

టెస్ట్‌ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేసిన టాప్‌-5 ఆటగాళ్లు..
సచిన్‌ టెండూల్కర్‌- 119
జో రూట్‌- 104
రికీ పాంటింగ్‌- 103
జాక్‌ కల్లిస్‌- 103
రాహుల్‌ ద్రవిడ్‌- 99

టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్‌-5 ఆటగాళ్లు..
సచిన్‌ టెండూల్కర్‌- 51
జాక్‌ కల్లిస్‌- 45
రికీ పాంటింగ్‌- 41
జో రూట్‌- 38
కుమార సంగక్కర- 38

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్‌-6 బ్యాటర్లు..
సచిన్‌ టెండూల్కర్‌- 100
విరాట్‌ కోహ్లి- 82
రికీ పాంటింగ్‌- 71
కుమార సంగక్కర- 63
జాక్‌ కల్లిస్‌- 62
జో రూట్‌- 56

ఈ సెంచరీతో రూట్‌ సాధించిన మరిన్ని ఘనతలు..

టెస్ట్‌ల్లో ఫాబ్‌-4 ఆటగాళ్లు చేసిన సెంచరీలు
రూట్‌-38 
స్టీవ్‌ స్మిత్‌- 36
కేన్‌ విలియమ్సన్‌- 33
విరాట్‌ కోహ్లి- 30

అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం యాక్టివ్‌ ఉండి అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్లు
విరాట్‌ కోహ్లి- 82
జో రూట్‌- 56
రోహిత్‌ శర్మ- 49
కేన్‌ విలియమ్సన్‌- 48
స్టీవ్‌ స్మిత్‌- 48

టెస్ట్‌ల్లో భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు
రూట్‌- 12
స్టీవ్‌ స్మిత్‌- 11

గత ఐదేళ్లలో 21 సెంచరీలు చేసిన రూట్‌
2021లో 6
2022లో 5
2023లో 2
2024లో 6
2025లో 2

మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడో రోజు ఆటలో రూట్‌ సెంచరీ పూర్తి చేసే సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 407/4గా ఉంది. రూట్‌ 104, స్టోక్స్‌ 27 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 49 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. 

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్‌ క్రాలే (84), బెన్‌ డకెట్‌ (94), ఓలీ పోప్‌ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్‌ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ 2, అన్షుల్‌ కంబోజ్‌, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీశారు.  

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 58, కేఎల్‌ రాహుల్‌ 46, సాయి సుదర్శన్‌ 61, శుభ్‌మన్‌ గిల్‌ 12, రిషబ్‌ పంత్‌ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్‌ ఠాకూర్‌ 41, వాషింగ్టన్‌ సుందర్‌ 27, అన్షుల్‌ కంబోజ్‌ 0, జస్ప్రీత్‌ బుమ్రా 5, మహ్మద్‌ సిరాజ్‌ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో బెన్‌ స్టోక్స్‌ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్‌ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్‌, డాసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement