విజృంభించిన బెన్‌ స్టోక్స్‌.. ఎనిమిదేళ్ల తర్వాత అరుదైన ఘనత | ENG VS IND 4th Test Day 2: Stokes Has A Fifer After 8 Years | Sakshi
Sakshi News home page

ENG VS IND 4th Test: విజృంభించిన బెన్‌ స్టోక్స్‌.. ఎనిమిదేళ్ల తర్వాత అరుదైన ఘనత

Jul 24 2025 6:41 PM | Updated on Jul 24 2025 7:06 PM

ENG VS IND 4th Test Day 2: Stokes Has A Fifer After 8 Years

మాంచెస్టర్‌ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో చెలరేగిపోయాడు. ఎనిమిదేళ్ల తర్వాత టెస్ట్‌ల్లో అరుదైన ఐదు వికెట్ల ఘనత సాధించాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో అన్షుల్‌ కంబోజ్‌ వికెట్‌ స్టోక్స్‌కు ఈ మ్యాచ్‌లో ఐదో వికెట్‌. కంబోజ్‌ను ఔట్‌ చేయకముందు స్టోక్స్‌ అదే ఓవర్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. 

అప్పటిదాకా సాఫీగా సాగిన భారత ఇన్నింగ్స్‌ స్టోక్స్‌ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయడంతో ఒక్కసారిగా కుదుపుకులోనైంది. కంబోజ్‌ వికెట్‌తో స్టోక్స్‌ ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు (16) తీసిన బౌలర్‌గానూ అవతరించాడు. ఈ ఇన్నింగ్స్‌లో స్టోక్స్‌ కంబోజ్‌, సుందర్‌ వికెట్లతో పాటు కీలకమైన సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌, శార్దూల్‌ ఠాకూర్‌ వికెట్లు తీశాడు.

లంచ్‌ విరామం తర్వాత భారత్‌ స్కోర్‌ 8 వికెట్ల నష్టానికి 349 పరుగులుగా ఉంది. రిషబ్‌ పంత్‌ 54, జస్ప్రీత్‌ బుమ్రా 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే. 

భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 58, కేఎల్‌ రాహుల్‌ 46, సాయి సుదర్శన్‌ 61, శుభ్‌మన్‌ గిల్‌ 12, రవీంద్ర జడేజా 20, శార్దూల్‌ ఠాకూర్‌ 41, వాషింగ్టన్‌ సుందర్‌ 27, అన్షుల్‌ కంబోజ్‌ 0 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టోక్స్‌ 5, వోక్స్‌, ఆర్చర్‌, డాసన్‌ తలో వికెట్‌ తీశారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement