Neymar: వెక్కి వెక్కి ఏడ్చిన నెయ్‌మర్‌.. కథ ముగిసినట్లే!

Is This End For Neymar Career FIFA WC legend Become Loser 10 minutes - Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో శుక్రవారం ఫుట్‌బాల్‌ అభిమానుల గుండెలు బరువెక్కాయి. టైటిల్‌ ఫెవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన బ్రెజిల్‌ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయం 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. షూటౌట్‌లో క్రొయేషియా 4-3 తేడాతో బ్రెజిల్‌ను ఓడించింది.

అంతే అంతవరకు నెయ్‌మర్‌.. నెయ్‌మర్‌ అంటూ మారుమోగిన స్టేడియం ఒక్కసారిగా నిశబ్దంగా మారిపోయింది. ఒకపక్క క్రొయేషియా సంబరాలు జరుపుకుంటుంటే.. బ్రెజిల్‌ ఆటగాళ్లు మాత్రం నిరాశలో మునిగిపోయారు. బ్రెజిల్‌ గుండెబలం అయిన నెయ్‌మర్‌ ఓటమి బాధతో ఒక్కక్షణం చిన్నపిల్లాడిలా మారిపోయాడు. మ్యాచ్‌ ఓటమితో మైదానంలోనే కూలబడిన నెయ్‌మర్‌ వెక్కి వెక్కి ఏడుస్తుంటే.. స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు కూడా కంటతడి పెట్టారు.

తమ అభిమాన ఆటగాడు అలా ఏడుస్తుంటే ఎవరు మాత్రం తట్టుకుంటారు చెప్పండి. పీలే, రొనాల్డో, రొనాల్డినో తర్వాత బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నెయ్‌మర్‌ ఈ మ్యాచ్‌లో గోల్‌ కొట్టడం ద్వారా దిగ్గజం పీలే రికార్డును సమం చేశాడు. ఇప్పటివరకు నెయ్‌మర్‌ బ్రెజిల్‌ తరపున 77 గోల్స్‌ చేశాడు. ఈ ఆనందం అతనికి ఎక్కువసేపు కూడా నిలవకుండా పోయింది.

మరి నెయ్‌మర్‌ వెక్కి వెక్కి ఏడ్వడం వెనుక ఒక కారణం ఉంది. ప్రస్తుతం అతని వయస్సు 30 ఏళ్లు. మరో ఫిఫా వరల్డ్‌కప్‌ ఆడే అవకాశం ఉన్నప్పటికి అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఇప్పటికే తరచూ గాయాల బారిన పడుతూ ఆటకు దూరమవుతున్న నెయ్‌మర్‌ మరో నాలుగేళ్లు ఇదే ఫిట్‌నెస్‌తో ఉంటాడా అంటే చెప్పలేం. ఇక గాయం కారణంగా 2014 ఫిఫా వరల్డ్‌కప్‌కు నెయ్‌మర్‌ పూర్తిగా దూరమయ్యాడు. ఆ తర్వాత 2015లో కోపా అమెరికా కప్‌ ఆడకుండా నిషేధం, 2018లో సెమీస్‌లో ఇంటిబాట పట్టడం, 2019 కోపా అమెరికా కప్‌ను బ్రెజిల్‌ తృటిలో మిస్‌ చేసుకుంది.

తాజాగా తొలి మ్యాచ్‌లో గాయపడిన నెయ్‌మర్‌.. రౌండ్‌ ఆఫ్‌ 16 ద్వారా రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. అతని ఆటతీరు చూసి బ్రెజిల్‌ మరోసారి ఛాంపియన్‌ అవుతుందని అంతా భావించారు. ఇక క్వార్టర్‌ ఫైనల్లోనూ నెయ్‌మర్‌ అదే దూకుడు కనబరిచాడు. కానీ దురదృష్టం అతన్ని వెంటాడింది. పెనాల్టీ షూటౌట్‌లో బ్రెజిల్‌కు ఓటమి తప్పలేదు. ఇప్పుడున్న గాయాలతో చాలా ఇబ్బంది పడుతున్న నెయ్‌మర్‌ వచ్చే వరల్డ్‌కప్‌ ఆడుతానో లేదో అన్న సందేహం అతనిలో ఉంది. అందుకే చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఇక నెయ్‌మర్‌ కథ దాదాపు ముగిసినట్లే.

ఫుట్‌బాల్‌ చరిత్రలో ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన బ్రెజిల్‌ 2002లో చివరిసారి ఫిఫా వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచింది. అప్పటినుంచి ఒక్కసారి కూడా ఛాంపియన్‌ కాలేకపోయింది. 2014లో సెమీఫైనల్లో ఇంటిబాట పట్టిన బ్రెజిల్‌.. మిగతా మూడుసార్లు క్వార్టర్స్‌కే పరిమితమైంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top