
బెంగళూరు: రుతురాజ్ గైక్వాడ్ (206 బంతుల్లో 184; 25 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత శతకం సాధించడంతో వెస్ట్‌జోన్ భారీస్కోరు సాధించింది. దులీప్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ జోన్‌తో గురువారం మొదలైన సెమీఫైనల్లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్‌జోన్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 6 వికెట్లకు 363 పరుగులు చేసింది.
తనుశ్ కొటియాన్ (121 బంతుల్లో 65 బ్యాటింగ్; 5 ఫోర్లు) రాణించాడు. సెంట్రల్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, సారాంశ్ జైన్ చెరో 2 వికెట్లు తీశారు. గత నెలలో జరిగిన బుచి్చబాబు టోర్నీలో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన పోరులో మహారాష్ట్ర తరఫున చెలరేగి సెంచరీ బాదిన రుతురాజ్ ఇక్కడి బీసీసీఐ ఎక్సలెన్సీ గ్రౌండ్‌లోనూ అదే జోరు కొనసాగించాడు.
4/1... 10/2!
బ్యాటింగ్‌కు దిగగానే వెస్ట్‌జోన్ కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ మొదలైన ఓవర్లోనే 4 పరుగుల స్కోరు వద్దే కీలకమైన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) వికెట్‌ను కోల్పోయింది. దీన్నుంచి తేరుకోకముందే మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్ (1) కూడా వికెట్‌ను అప్పగించడంతో 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన వెస్ట్ కష్టాల్లో కూరుకుంది.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన రుతురాజ్ ఆడిన ఆట, చేసిన పరుగులు, పాతుకుపోయిన భాగస్వామ్యాలతో వెస్ట్‌ను కష్టాల నుంచి గట్టెక్కించాడు. ముందుగా వన్‌డౌన్ బ్యాటర్ ఆర్య దేశాయ్ (39; 6 ఫోర్లు)తో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. చూడచక్కని బౌండరీలతో గైక్వాడ్ పరుగులు రాబట్టాడు. జట్టు స్కోరు 100కు ముందు 92 పరుగుల వద్ద ఆర్య అవుటయ్యాడు.
దీంతో మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 25; 4 ఫోర్లు) బాధ్యత కనబరచలేకపోయాడు. క్రీజులోకి రాగానే అవుటయ్యే ప్రమాదం నుంచి బయట పడినప్పటికీ మరెంతో సేపు క్రీజులో నిలువలేదు. కుదురుగా ఆడుతున్న రుతురాజ్‌కు సహకారం అందించాల్సిన చోట నిర్లక్ష్యంగా 137 స్కోరు వద్ద అతనూ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.
తనుశ్ అండతో...
రెండో సెషన్‌లో షమ్స్ ములానీ (18; 3 ఫోర్లు) కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఈ దశలో క్రీజులోకి వచి్చన తనుశ్ కొటియాన్ అండతో గైక్వాడ్ బ్యాటింగ్ జోరుగా సాగింది. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడమే కాదు... పరుగుల్ని కూడా చకచకా రాబట్టారు. ఈ క్రమంలోనే రుతురాజ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
శతకం తర్వాత అతను వన్డేను తలపించే ఆటతీరుతో అలరించడంతో పరుగుల వేగం అనూహ్యంగా పుంజుకుంది. జట్టు స్కోరు 300 పైచిలుకు దాటింది. ఇక డబుల్ సెంచరీ ఖాయమనుకున్న దశలో రుతురాజ్‌ను సారాంశ్ అవుట్ చేశాడు. దీంతో ఆరో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
కెప్టెన్ శార్దుల్ ఠాకూర్ (50 బంతుల్లో 24 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులోకి రాగా నింపాదిగా ఆడుతున్న తనుశ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇద్దరు నాటౌట్‌గా నిలిచారు.
రాణించిన పడిక్కల్, తన్మయ్
టాపార్డర్ బ్యాటర్లు బాధ్యతగా ఆడటంతో సౌత్‌జోన్ జట్టు దులీప్ ట్రోఫీ సెమీస్ పోరును సాధికారికంగా ప్రారంభించింది. ఓపెనర్ నారాయణ్ జగదీశన్ (260 బంతుల్లో 148 బ్యాటింగ్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు.
దులీప్ ట్రోఫీలో నార్త్‌జోన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌జోన్ తొలిరోజు ఆట నిలిచే సమయానికి తొలిఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ (71 బంతుల్లో 57; 7 ఫోర్లు), తన్మయ్ అగర్వాల్ (99 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించారు. నార్త్‌జోన్ బౌలర్లలో నిశాంత్ సింధు 2, అన్షుశ్ కంబోజ్ ఒక వికెట్ తీశారు.
ఓపెనర్ల శుభారంభం
టాస్ నెగ్గిన నార్త్‌జోన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సౌత్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్, జగదీశన్ చక్కని ఆరంభమిచ్చారు. ఇద్దరు చక్కని సమన్వయంతో పరుగులు సాధించారు. టీమిండియాతో కలిసి ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన నారాయణ్ జగదీశన్‌కు తుదిజట్టుకు ఆడే అవకాశం లభించలేదు. అయితే దేశవాళీ క్రికెట్‌లో తన బ్యాటింగ్ జోరును కనబరచడం ద్వారా సెలక్టర్ల దృష్టిని ఆకర్శించే ప్రయత్నం చేశాడు. తన్మయ్‌తో కలిసి నార్త్‌జోన్ బౌలర్లను అవలీలగా ఎదుర్కోన్నాడు.
ఓపెనర్లిద్దరూ పాతుకుపోవడంతో నార్త్‌జోన్‌కు తొలిసెషన్‌లో కష్టాలు తప్పలేదు. చూస్తుండగానే జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. ఎట్టకేలకు జట్టు స్కోరు 103 పరుగుల వద్ద తన్మయ్ నిష్క్రమించడంతో తొలివికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
పడిక్కల్ ఫిఫ్టీ
తొలి వికెట్ తీసిన ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్, జగదీశన్ పరుగులు చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. అనవసర షాట్ల జోలికి వెళ్లకుండా సింగిల్స్, డబుల్స్‌తో జట్టు స్కోరును నడిపించారు. క్రీజులో కుదురుకున్నాక పడిక్కల్ అడపాదడపా బౌండరీలతో అలరించాడు. దీంతో నార్త్ కష్టాలు కాస్త మళ్లీ మొదటికొచ్చాయి. ఇటు పరుగుల్ని ఆపలేక... అటు వికెట్లను పడగొట్టలేక నార్త్‌జోన్ బౌలర్లు రోజంతా ఆపసోపాలు పడ్డారు.
ఇక దేవదత్ అర్ధసెంచరీ సాధించగా, నారాయణ్ జగదీశన్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. జట్టు స్కోరు 200 పైచిలుకు దాటాకా పడిక్కల్‌ను అన్షుల్ కాంబోజ్ అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన మోహిత్ (15) తక్కువ స్కోరుకే పరిమితం కాగా... కెప్టెన్ అజారుద్దీన్ (11 బ్యాటింగ్), ఓపెనర్ జగదీశన్‌లు మళ్లీ మరో వికెట్ అవకాశాన్ని ఇవ్వకుండా రోజును ముగించారు. చేతిలో ఇంకా ఏడు వికెట్లున్న సౌత్‌జోన్ భారీస్కోరు దిశగా పయనిస్తోంది.
చదవండి: గంభీర్, సెహ్వాగ్, భజ్జీ.. అంతా బాధితులే: ధోనిపై మరోసారి యువీ తండ్రి ఫైర్