Duleep Trophy 2022 Semi Finals: రవితేజ మెరుపు శతకం, పదేసిన సాయికిషోర్‌.. ఫైనల్లో సౌత్‌ జోన్‌, వెస్ట్‌ జోన్‌

Duleep Trophy 2022 Semi Finals: West Zone And South Zone Enters Finals - Sakshi

హైదరాబాద్‌ ఆటగాడు తెలుకపల్లి రవితేజ (120 బంతుల్లో 104 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), తమిళనాడు యువ కిషోరం రవి శ్రీనివాసన్‌ సాయికిషోర్‌ (10/98) రెచ్చిపోవడంతో నార్త్‌ జోన్‌తో జరిగిన దులీప్‌ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్లో సౌత్‌ జోన్‌ 645 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు షమ్స్‌ ములానీ (5/72), చింతన్‌ గజా (3/49) చెలరేగడంతో కొయంబత్తూర్‌ వేదికగా సెంట్రల్‌ జోన్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో వెస్ట్‌ జోన్‌ 279 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ రెండు జట్లు (సౌత్‌ జోన్‌, వెస్ట్‌ జోన్‌) ఈనెల 21 నుంచి 25 వరకు కొయంబత్తూర్‌ వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.  

సౌత్‌ జోన్‌-నార్త్‌ జోన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ విషయానికొస్తే.. వికెట్‌ నష్టానికి 157 పరుగుల వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌత్‌ జోన్‌.. మరో 159 పరుగులు జోడించి 316/4 స్కోర్‌ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 11 పరుగులు జోడించి 64 పరుగుల వద్ద ఔటవగా.. రవితేజ సూపర్‌ ఫాస్ట్‌గా సెంచరీ సాధించి ప్రత్యర్ధికి 740 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్ధేశించారు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్త్‌ జోన్‌ కృష్ణప్ప గౌతమ్‌ (3/50), సాయికిషోర్‌ (3/28), తనయ్‌ త్యాగరాజన్‌ (3/12) దెబ్బకు కేవలం 94 పరుగులు మాత్రమే చేసి ఆలౌటై ఓటమిపాలైంది. నార్త్‌ జోన్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు యష్‌ దుల్‌ (59), మనన్‌ వోహ్రా (11) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. 

సౌత్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌: 630/8 డిక్లేర్‌ (కున్నుమ్మల్‌ 143, హనుమ విహారి 134, రికీ భుయ్‌ 103)
నార్త్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌: 207 ఆలౌట్‌ (నిషాంత్‌ సింధు 40, సాయికిషోర్‌ 7/70)
సౌత్‌ జోన్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌: 316/4 డిక్లేర్‌ (రవితేజ 104, కున్నుమ్మల్‌ 77)
నార్త్‌ జోన్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌: 94 ఆలౌట్‌ (యశ్‌ ధుల్‌ 59, సాయికిషోర్‌ 3/28)

ఇక వెస్ట్‌ జోన్‌-సెంట్రల్‌ జోన్‌ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్‌ విషయానికొస్తే.. వెస్ట్‌ జోన్‌ నిర్ధేశించిన 500 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగుల స్కోర్‌ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సెంట్రల్‌ జోన్‌ మరో 199 పరుగులు జోడించి మిగిలిన 8 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. రింకూ సింగ్‌ (65) ఒక్కడే హాఫ్‌ సెంచరీతో ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. వెస్ట్‌ జోన్‌ బౌలర్లలో షమ్స్‌ ములానీ (5/72), చింతన్‌ గజా (3/49), ఉనద్కత్‌ (1/44), అతిత్‌ సేథ్ (1/20) వికెట్లు పడగొట్టారు. 

వెస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌: 257 ఆలౌట్‌ (పృథ్వీ షా 60, రాహుల్‌ త్రిపాఠి 67, కుమార్‌ కార్తీకేయ 5/66)
సెంట్రల్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌: 128 ఆలౌట్‌ (కరణ్‌ శర్మ 34 , ఉనద్కత్‌ 3/24, తరుష్‌ కోటియన్‌ 3/17)
వెస్ట్‌ జోన్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌: 371 ఆలౌట్‌ (పృథ్వీ షా 142, హెథ్‌ పటేల్‌ 67, కుమార్‌ కార్తీకేయ 3/105)
సెంట్రల్‌ జోన్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌: 221 ఆలౌట్‌ (రింకూ సింగ్‌ 65, షమ్ ములానీ‌ 5/72)

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top