
బ్యాటర్లు విజృంభించడంతో నార్త్ జోన్ జట్టు దులీప్ ట్రోఫీ సెమీఫైనల్‌కు చేరువైంది. బెంగళూరు వేదికగా ఈస్ట్‌జోన్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి నార్త్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసింది. కెప్టెన్‌అంకిత్ కుమార్ (264 బంతుల్లో 168 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్స్), యశ్ ధుల్ (157 బంతుల్లో 133; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో కదం తొక్కారు.
తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న నార్త్ జోన్... రెండో ఇన్నింగ్స్‌లోనూ దుమ్ము రేపింది. ఓపెనర్ శుభమ్ ఖజురియా (21) త్వరగానే అవుటైనా... అంకిత్, ధుల్ రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. వీరిద్దరూ 290 బంతుల్లోనే 240 పరుగులు జోడించడంతో... నార్త్ జోన్ కొండంత స్కోరు చేయగలిగింది.
ఆయుశ్ బదోని (78 బంతుల్లో 56; 3 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈస్ట్ జోన్ బౌలర్లలో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయగా... తక్కినవాళ్లంతా భారీగా పరుగులు సమరి్పంచుకున్నారు. షమీ 11 ఓవర్లలో 36 పరుగులిచ్చి వికెట్ పడగొట్టలేకపోయాడు.
సూరజ్ జైస్వాల్, రియాన్ పరాగ్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 405 పరుగులు చేయగా... ఈస్ట్ జోన్ 230 పరుగులు చేసింది. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... చేతిలో 8 వికెట్లు ఉన్న నార్త్ జోన్ జట్టు ఓవరాల్‌గా 563 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంకిత్ కుమార్‌తో పాటు ఆయుశ్ బదోని క్రీజులో ఉన్నాడు.
చదవండి: మొన్న డబుల్ సెంచరీ.. ఇప్పుడు ఫెయిల్!.. అయితేనేం సెమీస్ దిశగా జట్టు