
దులీప్ ట్రోఫీ 2025లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఈ టోర్నీలో నార్త్ జోన్‌కు ఆడుతున్న జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దార్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలో ఓ బౌలర్ ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి.
ఈ ఘనత సాధించే క్రమంలో ఆకిబ్ నబీ హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. తద్వారా కపిల్ దేవ్, సాయిరాజ్ బహుతులే తర్వాత దులీప్ ట్రోఫీలో హ్యాట్రిక్ తీసిన మూడో బౌలర్‌గా చరిత్రపుటల్లోకెక్కాడు.
దులీప్ ట్రోఫీలో కపిల్ దేవ్ 1978/79 సీజన్‌లో నార్త్ జోన్‌కు ఆడుతూ వెస్ట్ జోన్‌పై హ్యాట్రిక్ సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో ఇదే తొలి హ్యాట్రిక్. ఆతర్వాత 2000/01 సీజన్‌లో సాయిరాజ్ బహుతులే వెస్ట్ జోన్‌కు ఆడుతూ ఈస్ట్ జోన్‌పై హ్యాట్రిక్ నమోదు చేశాడు. తాజాగా ఆకిబ్ నబీ కపిల్, బహుతులే సరసన చేరాడు. నబీకి దులీప్ ట్రోఫీలో ఇదే అరంగేట్రం మ్యాచ్ కావడం మరో విశేషం.
28 ఏళ్ల ఆకిబ్ నబీ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. మ్యాచ్ రెండో రోజు (ఆగస్ట్ 29) ఈ ఫీట్ నమోదైంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో నబీ 53వ ఓవర్ చివరి మూడు బంతులకు వరుసగా విరాట్ సింగ్ (బౌల్డ్), మనిశి (ఎల్బీడబ్ల్యూ), ముక్తర్ హుసేన్ (బౌల్డ్) వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు.
ఆతర్వాత 55వ ఓవర్ తొలి బంతికి సూరజ్ జైస్వాల్ (వికెట్‌కీపర్ క్యాచ్) వికెట్ తీసి వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆకిబ్ నబీ మెరుపులు ఇంతటితో ఆగిపోలేదు. ఆ మరుసటి ఓవర్ (57) తొలి బంతికి మొహమ్మద్ షమీ వికెట్ కూడా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
నబీ ధాటికి ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. 7 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 5 వికెట్లు కోల్పోయింది. ఈ ఐదు వికెట్లను నబీనే తీశాడు. నబీతో పాటు హర్షిత్ రాణా (2/56), అర్షదీప్ సింగ్ (1/51), మయాంక్ డాగర్ (1/41), నిషాంత్ సింధు (1/19) కూడా తలో చేయి వేయడంతో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకే కుప్పకూలింది. వీరి ఇన్నింగ్స్‌లో విరాట్ సింగ్ (69) ఉత్కర్ష్ సింగ్ (38), కెప్టెన్ రియాన్ పరాగ్ (39), కుమార్ కుషాగ్రా (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
అంతకుముందు నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 405 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆయుశ్ బదోని (63), కన్హయ్య (76) అర్ద సెంచరీలతో రాణించగా.. నిషాంత్ సింధు (47), ఆకిబ్ నబీ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మనిశి 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. టీమిండియా బౌలర్ షమీ (23-4-100-1)నిరాశపరిచాడు. మరో టీమిండియా బౌలర్ ముకేశ్ కుమార్ (14.5-1-50-0) గాయంతో తొలి రోజే వైదొలిగాడు.