ప్రపంచవ్యాప్తంగా యమా క్రేజ్ ఉన్న ఫిఫా ప్రపంచకప్ ప్రారంభానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఫిఫా వరల్డ్‌కప్‌కు ఈసారి అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. 39 రోజుల పాటు జరగనున్న సాకర్ సమరంలో 48 దేశాలు పాల్గొన నున్నాయి. ఫైనల్ సహా మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి.
మ్యాచ్‌ల నిర్వహణ, ఆరంభ వేడుకలకే పెద్ద మొత్తంలో ఖర్చు చేసే ఫిఫా నిర్వాహకులు.. టోర్నీలో విజేతగా నిలిచే జట్టుతో పాటు రన్నరప్ సహా సెమీఫైనలిస్ట్‌లు, క్వారర్ ఫైనలిస్ట్‌లు, గ్రూప్ దశలో వెనుదిరిగే జట్లకు అందించే ప్రైజ్‌మనీ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

2022 ఫిఫా ప్రపంచకప్ విజేత అర్జెంటీనా
అయితే 1998 వరకు ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్‌మనీ సాధారణంగానే ఉండేది. అయితే 1998 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ప్రైజ్‌మనీ విలువ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుత ఫిఫా వరల్డ్‌కప్‌లో మొత్తం ప్రైజ్‌మనీ విలువ 655 మిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 6 వేల కోట్లకు పైమాటే). 2022 ఫిఫా ప్రపంచకప్‌తో పోలిస్తే ప్రైజ్‌మనీ విలువ దాదాపు 50శాతం పెరగడం విశేషం.
ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీగా పిలవబడే ఈవెంట్ అయిన ఫిఫా ప్రపంచకప్‌తో క్రికెట్‌లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌తో పోల్చలేమని క్రీడా పండితులు పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్‌మనీలో టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీ సగం కూడా తూగదు. ఎందుకంటే ఫిఫా ప్రపంచకప్‌లో లీగ్ దశలో 17 నుంచి 32 స్థానాల్లో నిలిచే జట్లకు అందించే 11 మిలియన్ డాలర్లే ఐసీసీ టీ20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ విలువ కావడం గమనార్హం.

2026 టీ20 ప్రపంచకప్ విజేత భారత్
అందుకే ఐసీసీ టీ20 ప్రపంచకప్ విలువను ఫిఫా ప్రపంచకప్ విలువతో పోలిస్తే దాని కాలిగోటికి కూడా సరిపోదు. ఇక ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్‌మనీ అయిన 655 మిలియన్ అమెరికా డాలర్లను టోర్నీలో చాంపియన్స్‌గా నిలిచే జట్టు నుంచి లీగ్‌లో ఆఖరి స్థానంలో నిలిచే జట్లకు ఎలా పంచుతారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిఫా ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ: 655 మిలియన్ డాలర్లు
చాంపియన్స్: 50 మిలియన్ డాలర్లు
రన్నరప్: 33 మిలియన్ డాలర్లు
మూడు, నాలుగు స్థానాలు: 27 మిలియన్ డాలర్లు
5 నుంచి 8వ స్థానం : 19 మిలియన్ డాలర్లు
9 నుంచి 16వ స్థానం: 15 మిలియన్ డాలర్లు
17 నుంచి 32వ స్థానం: 11 మిలియన్ డాలర్లు
33 నుంచి 48వ స్థానం: 9 మిలియన్ డాలర్లు. దీనికి అదనంగా అర్హత సాధించిన ప్రతీ జట్టుకు సన్నాహక ఖర్చుల కింద మరో 1.5 మిలియన్ డాలర్లు అదనంగా లభిస్తాయి.
మరోవైపు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మొత్తం ప్రైజ్‌మనీ విలువ 11.25 మిలియన్ డాలర్లు.
చాంపియన్స్ (భారత్): 2.6 మిలియన్ డాలర్లు
రన్నరప్ (న్యూజిలాండ్): 1.42 మిలియన్ డాలర్లు
మూడో స్థానం (దక్షిణాఫ్రికా): 1 మిలియన్ డాలర్లు
నాలుగో స్థానం (ఇంగ్లండ్): 974,423 డాలర్లు
5 నుంచి 8వ స్థానం వరకు
వెస్టిండీస్ - 538,269 డాలర్లు
పాకిస్తాన్ - 522,692 డాలర్లు
జింబాబ్వే - 491,538 డాలర్లు
శ్రీలంక - 475,962 డాలర్లు
చదవండి: చతికిలపడ్డ బాలీవుడ్ స్టార్లు.. ఇది సార్ కోహ్లీ బ్రాండ్!


