హ్యాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో భారత షూటర్లు సత్తాచాటారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ స్వర్ణం సాధించగా, మను భాకర్ కాంస్యం గెలుచుకున్నారు. ఈ ఈవెంట్‌లో ఇద్దరు భారత షూటర్లు ఒకేసారి పోడియంపై నిలవడం విశేషం.
అయితే ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ ఆధిపత్యం ప్రదర్శించి, 40 హిట్స్‌తో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు తీవ్ర పోటీ నడుమ షూట్-ఆఫ్‌ను దాటుకుని వచ్చిన మను బాకర్ 28 హిట్స్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని సొంతం చేసుకుంది.
అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లోనూ భారత షూటర్లు తమ ఆధిపత్యాన్ని చాటారు. మను బాకర్ 586-20x స్కోరుతో క్వాలిఫయింగ్ చార్ట్‌లో అగ్రస్థానంలో నిలవగా, ఈషా సింగ్ 585-18x స్కోరుతో రెండో స్థానంలో నిలిచి ఎనిమిది మందితో కూడిన ఫైనల్‌కు అర్హత సాధించారు. కానీ ఫైనల్లో మాత్రం 21 ఏళ్ల ఇషా.. మనును వెనక్కి నెట్టి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.


