Dinesh Karthik: కలలు నిజంగా నేరవేరుతాయి.. దినేశ్‌ కార్తీక్‌ భావోద్వేగం

Dinesh Karthik Posts Heartfelt Tweet After His Inclusion In T20 World Cup Squad - Sakshi

ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెల (అక్టోబర్‌) 16 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌ కప్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఇవాళ (సెప్టెంబర్‌ 12) సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో వెటరన్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ వికెట్‌కీపర్‌ కమ్‌ ఫినిషర్‌ కోటాలో చోటు దక్కించుకున్నాడు. వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కిన అనంతరం డీకే భావోద్వేగానికి లోనయ్యాడు. జట్టును ప్రకటించిన కొద్ది నిమిషాల్లో ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. కలలు నిజంగా నేరవేరుతాయి అంటూ టీ20 వరల్డ్‌కప్‌ ఆడాలన్న తన కలను ప్రస్తావించాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరలవుతుంది. 

కాగా, 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన కార్తీక్‌.. 15 ఏళ్ల తర్వాత మరోసారి వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక కావడం ఆసక్తికరంగా మారింది. డీకే ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించి ఎవరూ ఊహించని రీతిలో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. తాను వరల్డ్‌కప్‌-2022లో ఆడాలని కలలు కంటున్నట్లు డీకే ఇటీవల తరుచూ ప్రస్తావించాడు. తాజాగా అతని కల నెరవేరడంతో  అతను భావోద్వేగానికి లోనయ్యాడు.

ఇదిలా ఉంటే, భారత ప్రపంచ కప్‌ జట్టులో ఎలాంటి సంచలన ఎంపికలకు తావివ్వని సెలెక్టర్లు.. తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో పాల్గొన్న జట్టునే యధాతథంగా కొనసాగించారు. వికెట్‌కీపర్లుగా డీకే, పంత్‌లను ఎంపిక చేసిన సెలెక్టర్లు సంజూ శాంసన్‌కు మొండిచెయ్యి చూపించారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్‌లు జట్టులోకి తిరిగి రాగా, గాయపడ్డ రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌ జట్టులో కొనసాగనున్నాడు. ఈ మార్పులు మినహాంచి అందరూ ఊహించినట్లుగా జట్టు ఎంపిక జరిగింది. 

టీ20 వరల్డ్ కప్ 2022లో పాల్గొనే భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్

స్టాండ్‌ బై ప్లేయర్లు: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి భిష్ణోయ్, దీపక్ చాహార్‌
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top