Delhi Police Records Statement of WFI Chief Brij Bhushan - Sakshi
Sakshi News home page

Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌ను విచారించిన పోలీసులు..

May 13 2023 10:25 AM | Updated on May 13 2023 10:41 AM

Delhi Police records WFI chief Brij Bhushan statement - Sakshi

న్యూఢిల్లీ: పలువురు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. కేసు తీవ్రత దృష్ట్యా ఢిల్లీ పోలీసులు పది మందితో ప్రత్యేక పరిశోధన బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. ఈ బృందంలో నలుగురు మహిళా పోలీసు అధికారిణులు కూడా ఉన్నారు.

గత నెలలో బ్రిజ్‌భూషణ్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని ఇటీవల బ్రిజ్‌భూషణ్‌కు నోటీసులు జారీ చేయగా... గురువారం ఆయన హాజరయ్యారని... ‘సిట్‌’ మూడు గంటలపాటు ఆయనను ప్రశ్నించదన ఢిల్లీ పోలీసు ఉన్నాతాధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, ఉద్దేశపూర్వకంగా తనను ఇరికిస్తున్నారని బ్రిజ్‌భూషణ్‌ సమాధానం ఇచ్చినట్లు ఆ పోలీసు అధికారి తెలిపారు.

ఇప్పటికే 30 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నామని, ఈ కేసుకు సంబంధించి మున్ముందు కూడా బ్రిజ్‌భూషణ్‌ను విచారణ కోసం పిలుస్తామన్నారు. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, హరియాణా రాష్ట్రాలకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలు వెళ్లినట్లు ఆ పోలీసు అధికారి వివరించారు.

ఇప్పటికైతే మేజిస్ట్రేట్‌ ఎదుట మైనర్‌ రెజ్లర్‌ వాంగ్మూలాన్ని తీసుకున్నామని... త్వరలోనే మరో ఆరుగురు మహిళా రెజ్లర్ల స్టేట్‌మెంట్‌ను కూడా మేజిస్ట్రేట్‌ సమక్షంలో నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణ నిమిత్తం ‘సిట్‌’ ఏర్పాటు చేశామని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజి్రస్టేట్‌ హర్జీత్‌సింగ్‌ జస్పాల్‌కు శుక్రవారం ఢిల్లీ పోలీసులు నివేదిక సమరి్పంచగా.. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు.
చదవండి: ఫైనల్లో బెర్త్‌ కోసం బరిలో భారత బాక్సర్లు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement