Lakshya Sen: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో స్వర్ణం..

CWG 2022: India Bags Another Gold In Badminton Lakshya Sen Won - Sakshi

Commonwealth Games 2022: కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో ఆఖరి రోజు బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. భారత షట్లర్‌ లక్ష్య సేన్‌ ఫైనల్లో సత్తా చాటాడు. మలేషియా ప్లేయర్‌ ఎన్‌జీ జీ యోంగ్‌ను ఓడించాడు. తద్వారా పసిడి పతకం గెలిచాడు. కాగా అంతకుముందు తెలుగు తేజం పీవీ సింధు..  బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది.

తడబడినా..
ఇక లక్ష్య సేన్‌ సోమవారం నాటి మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్లో మలేషియా షట్లర్‌ ఎన్‌జీ జీ యోంగ్‌తో తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన మొదటి గేమ్‌లో లక్ష్య సేన్‌ 19-21తో వెనుకబడ్డాడు. అయితే, రెండో గేమ్‌లో పుంజుకున్న అతడు 21-9తో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఇక ఆఖరి గేమ్‌లో ఆధిపత్యం కొనసాగిస్తూ 21-16తో లక్ష్య సేన్‌ యోంగ్‌ను ఓడించి స్వర్ణం ఖాయం చేసుకున్నాడు. కాగా లక్ష్య సేన్‌ గెలుపుతో భారత్‌ ఖాతాలో 20వ పసిడి పతకం చేరింది. 

దిగ్గజాల సరసన..
వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సాధించిన 20 ఏళ్ల లక్ష్య సేన్‌కు కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఇదే మొదటి టైటిల్‌. ఈ విజయంతో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పతకం గెలిచిన బ్యాడ్మింటన్‌ స్టార్లు ప్రకాశ్‌ పదుకొణె(1978), సయ్యద్‌ మోదీ(1982), పారుపల్లి కశ్యప్‌(2014) తదితరుల సరసన నిలిచాడు.

ఇక భారత బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు రజత పతకం లభించిన విషయం తెలిసిందే. గత మంగళవారం అర్థరాత్రి మలేషియాతో జరిగిన మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో 3-1 తేడాతో ఓడిన టీమిండియా రజతంతో సరిపెట్టుకుంది. పీవీ సింధు మినహా మిగతావారు ఓటమి పాలవడంతో స్వర్ణం గెలవాలన్న ఆశలు నెరవేరలేదు. ఇదిలా ఉంటే.. భారత్‌ ఇప్పటి వరకు 20 పసిడి, 15 రజత, 23 కాంస్య పతకాలు సాధించి మొత్తంగా 58 మెడల్స్‌తో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

చదవండి: PV Sindhu Gold Medal: చాంపియన్లకే చాంపియన్‌.. గోల్డెన్‌ గర్ల్‌.. క్వీన్‌.. సింధుపై ప్రశంసలు
Asia Cup 2022: ఆసియా కప్‌కు భారత జట్టు.. అయ్యర్‌కు నో ఛాన్స్‌! హుడా వైపే మెగ్గు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top