‘టెస్టు క్రికెట్‌ను చంపేస్తారా?’: మౌనం వీడిన సౌతాఫ్రికా బోర్డు | Cricket South Africa Breaks Silence On Weakened Team For New Zealand Tests | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు మౌనం వీడిన సౌతాఫ్రికా బోర్డు: అందుకే అనామక జట్టును పంపుతున్నాం!

Jan 3 2024 12:22 PM | Updated on Jan 3 2024 1:46 PM

Cricket South Africa Breaks Silence On Weakened Team For New Zealand Tests - Sakshi

Cricket South Africa Weakened Team For New Zealand Tests 2024: టెస్టు క్రికెట్‌ను అవమానించేలా వ్యవహరించారంటూ తమపై వస్తున్న విమర్శలపై సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు స్పందించింది. తమకు సంప్రదాయ క్రికెట్‌పై అపార గౌరవం ఉందని స్పష్టం చేసింది. మూడు ఫార్మాట్లలోనూ తమకు టెస్టులపైనే అమితమైన ప్రేమ ఉందని తెలిపింది.

కాగా న్యూజిలాండ్‌తో ఫిబ్రవరిలో జరుగనున్న టెస్టు సిరీస్‌కు సౌతాఫ్రికా క్రికెట్‌ అనామక జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. పటిష్ట కివీస్‌తో పోరుకు 14 మంది సభ్యులతో కూడిన ప్రొటిస్‌ జట్టులో కేవలం ఏడుగురు క్యాప్డ్‌ ప్లేయర్లు మాత్రమే ఉన్నారు.

వారిలో ఇద్దరు టీమిండియాతో బాక్సింగ్‌ డే టెస్టులో ఆడారు. వీరు కాక.. మిగతా వాళ్లంతా కొత్తవారే! సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో ప్రధాన ఆటగాళ్లు బిజీ కానున్న నేపథ్యంలో న్యూజిలాండ్‌ టూర్‌కు ఇలా కొత్త వాళ్లతో కూడిన జట్టును పంపేందుకు సిద్ధమైంది ప్రొటిస్‌ బోర్డు.

మండిపడ్డ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌
ఈ విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్‌ వా.. టెస్టు క్రికెట్‌ను అంతం చేసే కుట్ర జరుగుతోందంటూ సౌతాఫ్రికా క్రికెట్‌పై మండిపడ్డాడు. తానే గనుక న్యూజిలాండ్‌ స్థానంలో ఉంటే ఈ సిరీస్‌ను రద్దు చేయించేవాడినని ఘాటు విమర్శలు చేశాడు. సౌతాఫ్రికాకు సంప్రదాయ క్రికెట్‌ కంటే ఫ్రాంఛైజీ క్రికెట్‌ ముఖ్యమై పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ విషయంలో ఐసీసీ సహా బీసీసీఐ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డులు జోక్యం చేసుకుని టెస్టు క్రికెట్‌ చచ్చిపోకుండా చూడాలని స్టీవ్‌ వా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టెస్టు క్రికెట్‌ ప్రాధాన్యం గురించి కీలక వ్యాఖ్యలు చేయగా.. మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సైతం టెస్టు క్రికెట్‌ ఐసీయూ మీద ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.

మాకు టెస్టు క్రికెట్‌ అంటే అమితమైన ప్రేమ
ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విమర్శలపై స్పందించిన సౌతాఫ్రికా క్రికెట్‌.. ‘‘న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపిక చేసిన జట్టు గురించి సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు ప్రకటన ఇది. వచ్చే నెలలో న్యూజిలాండ్‌కు వెళ్లనున్న మా జట్టు గురించి అనేక ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

అయితే, అభిమానులకు ఒక విషయం స్పష్టం చేయాలని కోరుకుంటున్నాం. టెస్టు ఫార్మాట్‌ మీద మాకు అపారమైన గౌరవమర్యాదలు ఉన్నాయి. సంప్రదాయ క్రికెట్‌పై మాకు అమితమైన ప్రేమ ఉంది. 

నిజానికి న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌ వాయిదా వేయాలని మేము భావించాం. కానీ కుదరలేదు. ఈ సిరీస్‌పై నిర్ణయానికి వచ్చే ముందే సౌతాఫ్రికా టీ20 లీగ్‌ నిర్వాహకులకు మాట ఇచ్చాం. అందుకే ఇలా చేయకతప్పడం లేదు. 

ఇదొక్కటి మినహా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ సైకిల్‌లో సౌతాఫ్రికా మ్యాచ్‌లకు ఎటువంటి ఆటంకం కలుగబోదు’’ అని సీఎస్‌ఏ ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. కాగా టీ20 లీగ్‌ కోసం సౌతాఫ్రికా ద్వైపాక్షిక సిరీస్‌ల షెడ్యూల్‌ విషయంలో మార్పులు చేయాలనుకోవడం ఇది రెండోసారి. టీ20 లీగ్‌ సజావుగా సాగేందుకు వీలుగా గతంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకోవాలని ప్రొటిస్‌ బోర్డు భావించింది. 

అయితే, వన్డే వరల్డ్‌కప్‌-2023కి అర్హత సాధించాలంటే తప్పక ఆడాల్సిన ఈ సిరీస్‌ విషయంలో అడ్జస్ట్‌మెంట్లు చేసుకుంది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా ప్రస్తుతం టీమిండియాతో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉంది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి కేప్‌టౌన్‌లో రెండో టెస్టు ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఆతిథ్య సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement