
ప్రపంచ ప్రమాదకర బ్యాటర్లంతా సమకూడిన ఓ జట్టును సౌతాఫ్రికా వెటరన్ స్పిన్నర్ తబ్రేజ్ షంషి వణికించాడు. షంషి ధాటికి ఆ జట్టు పేకమేడలా కూలింది. ఇంతకీ ఏదా జట్టు.. ఎవరా ప్రమాదకర బ్యాటర్లు..?
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ అనే ఓ జట్టు ఉంది. ఈ జట్టులో ప్రపంచ ప్రమాదకర బ్యాటర్లైన కొలిన్ మున్రో, అలెక్స్ హేల్స్, నికోలస్ పూరన్, కీరన్ పోలార్డ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ లాంటి వారున్నారు.
వీరంతా నిన్న సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌లో లూసియా కింగ్స్ టాస్ ఓడి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి బంతి నుంచే లూసియా కింగ్స్ బౌలర్లు హేమాహేమీలున్న నైట్‌రైడర్స్‌ను భయపెట్టడం మొదలుపెట్టారు.
ఖారీ పియెర్, రోస్టన్ ఛేజ్, డెలానో పోట్‌గెటర్, అల్జరీ జోసఫ్, తబ్రేజ్ షంషి పోటీపడి వికెట్లు తీసి నైట్‌రైడర్స్‌ను మట్టుబెట్టారు. వీరిలో షంషి నైట్‌రైడర్స్ బ్యాటర్లను అధికంగా ఇబ్బందిపెట్టాడు. అతను 4 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి కీరన్ పోలార్డ్, అండ్రీ రసెల్, అకీల్ హోసేన్ లాంటి ప్రమాదకర బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేశాడు.
మున్రోను పియెర్ర్.. హేల్స్, పూరన్‌ను ఛేజ్.. సునీల్ నరైన్‌ను పోట్‌గెటర్ పెవిలియన్‌కు పంపారు. లూసియా కింగ్స్ బౌలర్ల ధాటికి నైట్‌రైడర్స్ 18.1 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. 30 పరుగులు చేసిన పూరన్ నైట్‌రైడర్స్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
నాథన్ ఎడ్వర్డ్స్ (17), పోలార్డ్ (14), రసెల్ (12), డారెన్ బ్రావో (11) రెండంకెల స్కోర్లు చేశారు. మున్రో డకౌట్, అకీల్ హొసేన్ డకౌట్, హేల్స్ 9, టెర్రన్స్ హిండ్స్ 7, నరైన్, ఉస్మాన్ తారిక్ 4 (నాటౌట్) పరుగులు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన లూసియా కింగ్స్.. టిమ్ సీఫర్ట్ (36), అకీమ్ అగస్టీ (28), రోస్టన్ ఛేజ్ (27 నాటౌట్), టిమ్ డేవిడ్ (1 నాటౌట్) చెలరగడంతో 11.1 ఓవర్లలోనే ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో నరైన్ 2, తారిక్ ఓ వికెట్ పడగొట్టారు.