
విండీస్ టీ20 దిగ్గజం కీరన్ పోలార్డ్ 38 ఏళ్ల వయసులోనూ వీర లెవెల్లో రెచ్చిపోతున్నాడు. ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ఆడుతున్న ఈ భారీకాయుడు విధ్వంసం సృష్టించడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ లీగ్ ప్రారంభం నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న పోలీ.. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో (సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై) ఉగ్రరూపం ప్రదర్శించాడు.
ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ తొలుత బ్యాటింగ్ చేస్తుండగా.. అప్పటివరకు నిదానంగా (13 బంతుల్లో 12 పరుగులు) ఆడిన పోలార్డ్ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. 8 బంతుల్లో ఏకంగా 7 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 15వ ఓవర్ మూడో బంతికి మొదలైన పోలీ విధ్వంసకాండ ఆతర్వాతి ఓవర్ అంతా సాగింది.
THE FORCE, KIERON POLLARD...!! 🤯🔥 pic.twitter.com/JkOP3RH7p7
— Johns. (@CricCrazyJohns) September 1, 2025
తొలుత నేవియన్ బిదైసీ బౌలింగ్‌లో 3, 4, 6 బంతులను సిక్సర్లుగా మలిచిన పోలార్డ్.. వాకర్ సలాంఖిల్ వేసిన ఆతర్వాతి ఓవర్‌లో మరింత రెచ్చిపోయి వరుసగా 3 నుంచి 6 బంతులను స్టేడియం దాటించాడు. మధ్యలో ఒక్క బంతి మినహా పోలార్డ్ వరుసగా తానెదుర్కొన్న 8 బంతుల్లోనే ఏడింటిని (6,6,0,6,6,6,6,6) సిక్సర్లుగా మలిచాడు.
ఈ క్రమంలో పోలార్డ్ కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఇన్నింగ్స్‌లో అతడు పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అలెక్స్ హేల్స్‌ను (14031) వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ విభాగంలో క్రిస్ గేల్ (14562) ఒక్కడే పోలార్డ్ (13070) కంటే ముందున్నాడు.
పేట్రియాట్స్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 29 బంతులు ఎదర్కొన్న పోలార్డ్ 2 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేశాడు. పోలార్డ్‌తో పాటు పూరన్ (38 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
అనంతరం 180 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పేట్రియాట్స్ ఆదిలో లక్ష్యం దిశగా సాగినా, ఆతర్వాత తడబడింది. నాథన ఎడ్వర్డ్స్ (3.2-0-30-3), మొహమ్మద్ ఆమిర్ (3.4-0-29-2) చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 12 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. ఈ గెలుపుతో (7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.