CWG 2022 IND VS PAK: మంధాన విధ్వంసం.. పాక్‌ను మట్టికరిపించిన భారత్‌

Commonwealth Games 2022: India Vs Pakistan Updates And Highlights - Sakshi

మంధాన విధ్వంసం.. పాక్‌ను మట్టికరిపించిన భారత్‌ 
కామన్‌వెల్త్‌ క్రీడల్లో భాగంగా పాక్‌తో జరిగిన కీలక సమరంలో టీమిండియా ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో భారత్‌ మెరుపు వేగంతో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్‌ స్మృతి మంధాన (42 బంతుల్లో 63 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం ధాటికి భారత్‌ మరో 38 బంతులుండగానే (11.4 ఓవర్లలోనే) లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది.  

పాక్‌: 99 ఆలౌట్‌
భారత్‌: 102/2 (11.4 ఓవర్లు)

మంధాన సుడిగాలి హాఫ్‌ సెంచరీ
భారత ఓపెనర్‌ స్మృతి మంధాన సుడిగాలి హాఫ్‌ సెంచరీ బాదింది. స్వల్ప లక్ష్య ఛేదనలో మంధాన ఆకాశమే హద్దుగా చెలరేగుతుంది. 31 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఫిఫ్టి పూర్తి చేసింది. మంధాన వీర బాదుడు ధాటికి టీమిండియా  8 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 76 పరుగులు చేసి విజయం దిశగా సాగుతుంది. ​

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
100 పరుగుల స్వల లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతుంది. ఓపెనర్లు షఫాలీ వర్మ (9 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్‌), మంధాన (26 బంతుల్లో 44; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడుతున్నారు. ముఖ్యంగా మంధాన పాక్‌ బౌలర్లను చీల్చి చెండాడుతుంది.  ఈ దశలో షఫాలీ వర్మ మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటైంది. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 61/1.  

కుప్పకూలిన పాక్‌
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. భారత బౌలర్ల ధాటికి 99 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి పాక్‌ నడ్డి విరిచారు. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో (18వ ఓవర్‌లో) పాక్‌ ఏకంగా మూడు వికెట్లు కోల్పోయింది. రాధా యాదవ్‌, స్నేహ్‌ రాణా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రేణుకా సింగ్‌, మేఘన సింగ్‌, షఫాలి వర్మ తలో వికెట్‌ సాధించారు. ముగ్గురు బ్యాటర్లు రనౌటయ్యారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ మునీబా అలీ (32) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. 

12 ఓవర్ల తర్వాత పాక్‌ స్కోర్‌ 66/4
ఇన్నింగ్స్‌ ఆరంభంలో నత్తనడకలా సాగిన పాక్‌ స్కోర్‌ బోర్డు 12 ఓవర్లు ముగిసాక కూడా అదే తీరులో సాగుతోంది. 8వ ఓవర్‌లో 14 పరుగులు సాధించిన ఆ జట్టు..  ఆ తర్వాత స్నేహ్‌ రాణా వేసిన 9వ ఓవర్‌లో మహరూఫ్‌ (17), మునీబా అలీ (32) వికెట్లు కోల్పోయింది. ఆతర్వాత రేణుకా సింగ్‌ వేసిన 12వ ఓవర్‌లో పాక్‌ మరో వికెట్‌ కోల్పోయింది. రేణుకా సింగ్‌ బౌలింగ్‌లో రోడ్రిగ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి అయేషా నసీమ్‌ (10) పెవిలియన్‌ బాట పట్టింది. 12 ఓవర్ల తర్వాత పాక్‌ స్కోర్‌ 66/4గా ఉంది. ఆలియా రియాజ్‌(1), ఒమైమా సొహైల్‌ (5) క్రీజ్‌లో ఉన్నారు.    

నత్తనడకన సాగుతున్న పాక్‌ బ్యాటింగ్‌..
వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన పాక్‌ ఇన్నింగ్స్‌ నత్తనడకను తలపిస్తుంది. సున్నా పరుగులకే రెండో ఓవర్‌లో వికెట్‌ కోల్పోయిన ఆ జట్టు 7 ఓవర్లు ముగిసే సరికి  వికెట్‌ నష్టానికి కేవలం 35 పరుగులు మాత్రమే చేయగలిగింది. బిస్మా మహరూఫ్‌ (16), మునీబా అలీ (18) క్రీజ్‌లో ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన పాక్‌
టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేస్తున్న భారత్‌కు రెండో ఓవర్‌లోనే వికెట్‌ దక్కింది. మేఘన సింగ్‌ బౌలింగ్‌లో యస్తిక క్యాచ్‌ పట్టడంతో ఇరామ్‌ జావీద్‌ డకౌట్‌గా వెనుదిరిగింది. అంతకుముందు తొలి ఓవర్‌ను రేణుకా సింగ్‌ మెయిడిన్‌ చేసింది. 2 ఓవర్ల తర్వాత పాక్‌ స్కోర్‌ 7/1. క్రీజ్‌లో బిస్మా మహరూఫ్‌ (5), మునీబా అలీ (1) ఉన్నారు. 

వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదింపు
మ్యాచ్‌ ప్రారంభానికి ముందు నుంచే వరుణుడు ఆటంకం కలిగించడంతో టాస్‌ గంటకు పైగా ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌ సాయంత్రం 4:15 గంటలకు ప్రారంభమైంది. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌
టీమిండియాతో హైఓల్టేజ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం..
క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభంకావాల్సి ఉండింది. అయితే మ్యాచ్‌ వేదిక అయిన ఎడ్జ్‌బాస్టన్‌లో జల్లులు కురుస్తుండటంతో కనీసం టాస్‌ కూడా సాధ్యపడలేదు. వరుణుడు శాంతించి మ్యాచ్‌ సజావుగా సాగాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్‌కు సంబంధించి ఇవాళ (జులై 31) హైఓల్టేజ్‌ మ్యాచ్‌ జరుగనుంది. చిరకాల ప్రత్యర్ధులైన భారత్‌-పాక్‌లు ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రీడల్లో గ్రూప్‌-ఏలో పోటీపడుతన్న ఇరు జట్లు.. తమతమ మొదటి మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధుల చేతుల్లో పరాజయం పాలయ్యారు. భారత్‌.. ఆరంభ మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతో పరాజయం పాలవ్వగా.. పాక్‌కు పసికూన బార్బడోస్‌ (15 పరుగుల తేడాతో ఓటమి) షాకిచ్చింది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు తొలిసారి ప్రాతినిధ్యం లభించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ సత్తా చాటుతుంది. ఈ క్రీడల్లో భారత్‌ ఇప్పటివరకు నాలుగు పతకాలు సాధించి మాంచి జోరు మీద ఉం‍ది. భారత్‌ సాధించిన నాలుగు పతాకలు వెయిట్ లిఫ్టింగ్‌లో సాధించినవే కావడం విశేషం. మీరాబాయ్‌ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించగా, 55 కేజీల విభాగంలో సంకేత్‌ మహదేవ్‌ సార్గర్‌ రజతం, 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ్‌ పూజారి కాంస్య పతాకలు సాధించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top